చేర్యాల డివిజన్ కోసం బోయినపల్లిని కలిసిన నాగపురి..
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 19 : చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకై చేర్యాల ప్రాంతం పట్ల అవగాహన ఉన్న హన్మకొండ మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ రావు ను మాజీ ఎమ్మెల్సీ నాగపూరి రాజలింగం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ లు మంగళవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేర్యాల రెవిన్యూ డివిజన్ ఏర్పాటు ఆవశ్యకతపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు పాత చేర్యాల నియోజవర్గం ఉన్నప్పుడు హనుమకొండ పరిధిలో ఎంపీగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ ఈ నియోజవర్గానికి ఎంతో సేవ చేశారన్నారు. జనగామ నియోజకవర్గంలోని సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న నాలుగు మండలాలు ఉన్నందున ప్రస్తుతం ఏర్పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి వారికి వివరించారు. చేర్యాల, కొమురవెల్లి మండలాలు సిద్దిపేట రెవిన్యూ డివిజన్ కింద ఉండడం, దూల్మిట్ట, మద్దూరు మండలాలు హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండడంతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుందని, నాలుగు మండలాల ఏసీపీ కార్యాలయం హుస్నాబాద్ కు వెళ్లాల్సి వస్తుందన్నారు. చేర్యాల, కొమురవెల్లి మండలాలకు కోర్టు పరిధి సిద్దిపేట కాగా, రెండు మండలాలు హుస్నాబాద్ కోర్టు కు కేటాయించారు. వ్యవసాయ సంబంధిత కార్యాలయం గజ్వేల్ కు కేటాయించారని, దాదాపు మండల కేంద్రాల నుండి 50 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందన్నారు. ఒకప్పుడు చేర్యాల తాలూకాగా, నియోజకవర్గ కేంద్రంగా ఉండేదని, ఈ ప్రాంతం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఈ నియోజకవర్గానికి 50 సంవత్సరాల సుదీర్ఘ సేవ అందించిన వ్యక్తిగా తమకు చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ పేర్కొన్నారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.




