Thursday, 5 November 2026

కామ్రేడ్ కంపాటి చంద్రన్నకు ఘన నివాళులు

టేకులపల్లి, సెప్టెంబర్ 20 (జనం సాక్షి ): కామ్రేడ్ కాంపాటి చంద్రన్న 14వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా టేకులపల్లి మండల కమిటీ స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి ధర్మపురి వీర బ్రహ్మచారి, ఐఎఫ్టియు జిల్లా నాయకులు జరుపుల సుందర్ మాట్లాడుతూ కామ్రేడ్ చంద్రన్న 1995 లో పార్టీ ఆదేశాలలో భాగంగా టేకులపల్లి మండలానికి ఆర్గనైజర్గా వచ్చారన్నారు. అప్పట్లో పార్టీ ఉనికి లేని కొత్త ప్రాంతాలైన కొండంగుల బోడు,మద్రాస్ తండా, జండాల్ తండా, బిల్లు తండా, బొమ్మనపల్లి పాత పంచాయతీలలో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. అక్కడి ప్రజల సమస్యల పట్ల పోరాటాలు చేశారని, ఆ ప్రాంత ప్రజలలో తను నాయకుడుగా ఎదిగారు అన్నారు. చంద్రన్న పార్టీని పటిష్ట పరచడమే కాకుండా వ్యక్తిగతంగా మంచి హృదయం కలిగిన వాడని అక్కడ ప్రజలతో మమేకమై గాయకుడుగా, కళాకారుడిగా గొంగడి భుజాన వేసుకొని అద్భుతమైన పాటలు పాడేవాడని, మిమిక్రీ చేసి ప్రజల్ని ఆకట్టుకునేవాడని వారన్నారు. మంచి వ్యక్తిత్వం కలిగిన చంద్రన్న అనారోగ్యంతో మృతి చెందడం పార్టీకి ఎంతో తీరం లోటని, తన ఆశయ సాధన కోసం మున్ముందుకు పోవాలని పార్టీ శ్రేణులకు వారు పిలుపునిచ్చారు.