సీఎం దిష్టిబొమ్మ దహనం
వేములవాడ గ్రామీణం, సెప్టెంబర్ 21 (జనంసాక్షి): వేములవాడ ఆలయానికి చెందిన ఆదాయాన్ని కామారెడ్డి జిల్లాకు మళ్లించడానికి నిరసిస్తూ గ్రామీణ బిజెపి ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ అధ్యక్షుడు జక్కుల తిరుపతి మాట్లాడుతూ రాజన్న ఆలయ డెవలప్మెంట్ కు యేటా రూపాయలు 100 కోట్లు కేటాయిస్తానని సీఎం కేసీఆర్ హామీలకే పరిమితం చేసి, రాజన్నకే శఠగోపం పెట్టారని విమర్శించారు. రాబోయే ఎన్నికలలో కెసిఆర్ కామారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నందున, కామారెడ్డికి రాజన్న సొమ్ము రూ.5 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. గతంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 50 లక్షల రూపాయలు నిర్మల్ జిల్లాకు తరలించారని, ఇలాంటి చర్యలను మానుకోవాలన్నారు. ఆలయానికి సంబంధించిన ఆదాయాన్ని పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం మాత్రమే వాడాలన్నారు.




