సమయం వృధా కావద్దని ఆలోచన చేశా – జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
జనంసాక్షి, మంథని : ఎమ్మెల్యేగా ఓడిపోయినా సీఎం కేసీఆర్ జెడ్పీ చైర్మన్గా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమయం వృధా చేయవద్దనే ఆలోచన చేశామని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. గత ఎన్నికల్లో మన ఓట్లతో గెలిచిన నాయకులు ప్రజలు పని చెప్తే మా ప్రభుత్వం లేదని చెప్తున్నారే కానీ ఏనాడు మన గురించి ఆలోచన చేయడం లేదన్నారు. ప్రజలకు అన్యాయం జరుగద్దని, సమయం పోతే రాదని ఆలోచన చేసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ సహకారంతో అభివృద్దితో పాటు ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నానని ఆయన అన్నారు. నాలుగేండ్లలో ఎమ్మెల్యేగా అవకాశం లేకపోయినా జెడ్పీ చైర్మన్గా ప్రజల కష్టాలు తెలిసిన వాడిగా తనవంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని అన్నారు. ఈనాడు అన్నం పెట్టేవాళ్లు ఎవరో, అండగా నిలిచే వాళ్లు ఎవరో ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్ పథకం ద్వారా నియోజకవర్గానికి 1400 ఇండ్లు మంజూరీ చేసి పేదోడి సొంతింటి కలకు సాకారం చేయాలని చూస్తే ఆనాడు తనపై కుట్రలు, అసత్య ఆరోపణలు చేసి ప్రజలకు దూరం చేయడంతో పాటు అభివృధ్దికి అడ్డం పడ్డారని ఆయన వివరించారు. ఎమ్మెల్యేగా ఓడిపోకపోతే ఈనాడు డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తయి ఆడబిడ్డలు ఆ ఇండ్లలో ఉండేవారు కాదా అని ప్రశ్నించారు. గతానికి, ప్రస్తుతానికి బేరీజు వేసుకోవాలని, అనవసరమైన విషయాలపై కాకుండా మనకు అక్కరకు వచ్చే విషయాలపై చర్చించాలని, ఆలోచన చేయకపోతే ప్రమాదం పొంచి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. నియోజకవర్గంలోని ప్రతి పేదోడికి ఇల్లు ఉండాలని గృహలక్ష్మి పథకం ద్వారా 1500 ఇండ్లు మంజూరీ చేయించామని, మరో 650ఇండ్లు మంజూరీ చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియలా కొనసాగుతుందని, ఈసారి మంజూరీ కాని వాళ్లకు మరో విడతలో మంజూరీ అవుతుందన్నారు. దేశానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ అని ఇన్నేండ్లు అయినా ఆ శని పోవడం లేదన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సీఎంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకంలో రికార్డు స్థాయిలో మంథని నియోజకవర్గంలోనే అవినీతి జరిగిందని, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ నాయకులు దోచుకున్నారని, బిల్లులు కాజేశారని అన్నారు. లబ్దిదారులకు తెలియకుండానే బిల్లులు తీసుకుని పేదోళ్లకు అన్యాయం చేశారన్నారు. అలాంటి పరిస్థితులు లేకుండా పకడ్బందీ గృహలక్ష్మి పథకం అమలు అవుతుందని, విడతలవారిగా లక్ష చొప్పున అందించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పుణ్యాన పేదోడి సొంతింటి కల సాకారం చేకూర్చడానికి తొమ్మిదేండ్లు పట్టిందన్నారు. వారు చేసిన అవినీతి అక్రమాలతోనే ఇలాంటి పథకం అమలులో ఆలస్యం అయిందని ఆయన వివరించారు. పేదోడికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈనాడు మళ్లీ మాయమాటలు చెప్పి ఓట్ల కోసం వస్తున్నారని అన్నారు. అలాంటి నాయకుల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని ఆయన సూచించారు. తాము ఏనాడు ఓట్ల కోసం ప్రజలకు మాయమాటలు చెప్పలేదని, ప్రజలతో తనకున్నది ఓటు సంబంధం కాదని, పేగు సంబందమని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గంలోని పేదల గురించి నిరంతరం ఆలోచన చేస్తున్నామని, వారి కోసమే తమ జీవితాలు అంకితం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు




