తాండూరు ఏప్రిల్ 17(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని బాణపూర్ గ్రామంలో ఈ నెలా 24, 25 తేదీలలో సంత్ సేవాలాల్ జయంతి, భవాని మాత ఉత్సవాలను ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ విట్ఠల్ నాయక్ తెలిపారు. సేవాలాల్ ఉత్సవాల్లో భాగంగా గ్రామ గిరిజన మహిళలకు సాంప్రదాయ వస్త్రధారణ దుస్తుల కొనుగోలు కు రూ.2 లక్షల నగదును గ్రామ సర్పంచ్ బాలిబాయికి విట్ఠల్ నాయక్ అందించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సాంప్రదాయ పద్దతులను మరిచిపోకుండా ఉండేందుకు ప్రతి మహిళకు గిరిజన దుస్తులను అందిస్తున్నట్లు తెలిపారు. సేవాలాల్ జయంతి రోజున గిరిజన సాంప్రదాయ పద్దతిలో జరిగే సాంస్కృతిక ప్రదర్శనలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజన దుస్తుల కొనుగోలుకు రూ.2లక్షల నగదును విట్ఠల్ నాయక్ అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు కమిలి బాయి, రుక్కిబాయి తదితరులు ఉన్నారు.




