ఏలూరు,నవంబర్30(జనంసాక్షి): టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిసెంబరు 3 నుంచి 8వ తేదీ వరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరగనున్నాయి. ఈ మేరకు టిటిడి ఏర్పాట్లు చేసింది. 3న టి.నరసాపురం మండలం నాయకులగూడెంలో, 4న కమవరపుకోటలో, 5న చింతలపూడి మండలం వేంకటాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో, 6న దేవరపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో, 7న గోపాలపురం మండలం దొండపూడి జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో, 8న నరసాపురంలోని తితిదే కల్యాణమండపంలో శ్రీనివాస కల్యాణాలు జరగనున్నాయి. కల్యాణాలు సాయంత్రం 6గంటల నుంచి ప్రారంభమవుతాయని తితిదే అధికారులు తెలిపారు.మొదట డిసెంబరు 9నుంచి 13వ తేదీ వరకు కల్యాణాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయగా.. పాలనాపరమైన కారణాలతో ముందుగా కల్యాణాలు నిర్వహించనున్నారు.




