హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు వాయిదా పడ్డాయి. ఉభయ సభల సమావేశాలు తిరిగి కొత్త సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి.
శాసనసభ జనవరి 3 వరకు వాయిదా
నేటితో ఈ ఏటి శాసనసభ సమావేశాలు ముగిశాయి. రాష్ట్ర శాసనసభ సమావేశాలను 2014 జనవరి 3వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు సభాపతి నాదెండ్ల మనోహర్ గురువారం మధ్యాహ్నం ప్రకటించారు. జనవరా 3 నుంచి 23వ తేదీ వరకు రెండు విడతలుగా నిర్వహించనున్న సమావేశాల షెడ్యూల్ను స్పీకర్ ప్రకటించారు. జనవరి 3 నుంచి 10 వరకు తొలివిడత సమావేశాల్లో జనవరి 5న సెలవుదినం. జనవరి 16 నుంచి 23 వరకు జరిగే రెండో విడత సమావేశాల్లో 18,19 తేదీలు సెలవు దినాలు. జనవరిలో మొత్తం 13 రోజులు శాసనసభ సమావేశాలు జరుగుతాయి.
శాసనమండలి వాయిదా
శాసనమండలి కూడా జనవరి 3 వరకు వాయిదా పడింది. ఇరుప్రాంతాలకు చెందిన ఎమ్మెల్సీలు మండలి సమావేశంలో ఆందోళన కొనసాగించడంతో మండలిలో వాయిదాల పర్వం కొనసాగింది. చివరికి సమావేశాలను జనవరి మూడు వరకూ వాయిదా వేస్తూ ఛైర్మన్ చక్రపాణి ప్రకటన చేశారు. అంతకుముందు మండలిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు.
చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం: సీఎం
చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుంకోగల్గుతామని ముఖ్యమంత్రి అన్నారు. సున్నితమైన అంశం కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకుంటే ఇబ్బందులు రావన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా చర్చ జరిగిందో అధ్యయనం చేసి స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందన్నారు. నిబంధనలకనుగుణంగా చర్చ జరుపుకోవాలని విఙ్ఞప్తి చేశారు. తెదేపా ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు స్పందిస్తూ … ముఖ్యమంత్రి అప్పీల్లో స్పష్టత ఇవ్వాలన్నారు.




