30ఏళ్ల నీటి డిమాండ్‌ వివరాలివ్వండి


తెలంగాణ,ఆంధ్రా రాష్ట్రాల ఈఎన్సీలకు కేఆర్‌ఎంబీ లేఖ
హైదరాబాద్‌,నవంబరు 12(జనంసాక్షి):జూరాల, శ్రీశైలం, సాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల వివరాలు తక్షణమే సమర్పించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తెలుగు రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ)లకు కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వివరాలను ఇవ్వాలని కోరింది. ప్రాజెక్టుల ఔట్‌లెట్ల నీటి ప్రవాహాలు, గేట్ల నిర్వహణ విధానానికి సంబంధించిన వివరాలు సమర్పించాలని తెలిపింది. ఫ్లడ్‌ హైడ్రోగ్రాఫ్‌, రిజర్వాయర్‌ రూటింగ్‌ స్టడీ వివరాలను అడిగింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి 30 ఏళ్ల డిమాండ్‌ వివరాలు ఇవ్వాలని ఈఎన్‌సీలను కోరింది. వీలైనంత త్వరగా సమాచారం అందించాలని రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలను లేఖలో కోరింది.
17న జీఆర్‌ఎంబీ ఉపసంఘం భేటీ..
ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) ఉపసంఘం భేటీ కానుంది. దేవాదుల, తొర్రిగెడ్డ, చాగలనాడు ఎత్తిపోతల పంప్‌ హౌస్‌లపై చర్చించనున్నారు. కాకతీయ కాల్వ క్రాస్‌ రెగ్యులేటర్‌ అంశంపై భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.