
పనాజీ/అగర్తల/గ్యాంగ్ టక్/గువాహటి: లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకుని గోవా, అస్సాం, త్రిపుర, సిక్కింలోని 7 లోక్ సభ స్థానాలకు శనివారం పోలింగ్ ప్రారంభమైంది.గోవా: రాష్ట్రంలోని రెండు లోక్ సభ స్థానాలకు పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన అరగంటలోపలే నలుగురు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ వోటు హక్కు వినియోగించుకున్నారు. రాజధానిలోని మస్సాన్ డె అమోరిమ్ పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తన వోటు వేశారు. ఉత్తర గోవా, దక్షిణ గోవాలోని రెండు నియోజకవర్గాలలో మొత్తం 10,57,499 మంది వోటర్లు ఉన్నారు. మొత్తం 1,622 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉత్తర గోవాలో పోటీ ప్రధానంగా సిట్టింగ్ బిజెపి ఎంపి శ్రీపాద్ యశోనాయక్, కాంగ్రెస్ అభ్యర్థి రవి నాయక్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి దత్తారాం దేశాయ్ మధ్య ఉంది. దక్షిణ గోవా స్థానంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపి అలెక్సో రెజినాల్డో, బిజెపి అభ్యర్థి నరేంద్ర సావల్కర్ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఇప్పటివరకు జరిగిన 14 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ స్థానాన్ని 10 సార్లు గెలుచుకుంది.అస్సాం: అస్సాంలోని 3 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. సిల్చర్, కరీంగంజ్, దిఫు(స్వయంప్రతిపత్తి జిల్లా) నియోజకవర్గాలలో జరుగుతున్న ఎన్నికలలో మొత్తం 3,698 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 30 లక్షల మంది వోటర్లు ఇక్కడ ఉన్నారు. కరీంగంజ్ లోక్ సభ స్థానం ఎస్సిలకు రిజర్వ్ కాగా, దిఫూ నియోజకవర్గం ఎస్టిలకు రిజర్వ్ అయింది. మొత్తం 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం మూడు విడతలుగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 7న ఐదు నియోజకవర్గాలకు మొదటి విడత పోలింగ్ జరిగింది. నేడు 3 నియోజకవర్గాలకు, మూడవ విడతగా ఏప్రిల్ 24న మిగిలిన 6 నియోజకవర్గాలలో పోలింగ్ జరగనున్నది. సిల్చర్ నియోజకవర్గంలో బిజెపి సిట్టింగ్ ఎంపి కబీంద్రో పూర్యకస్థ, కాంగ్రెస్ అభ్యర్థి,మాజీ కేంద్ర మంత్రి సంతోష్ మోహన్ దేబ్ కుమార్తె, కాంగ్రెస్ ఎమ్మెల్యే సుస్మిత దేబ్ , ఎఐడియుఎఫ్ అభ్యర్థి కుతుబ్ అహ్మద్ మజుందర్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉంది. కరీంగంజ్ లో బిజెపికి చెందిన కృష్ణదాస్, కాంగ్రెస్కు చెందిన మోహన్ శుక్లాబైద్య, ఎఐయుడిఎఫ్కు చెందిన రాధేశ్యాం బిశ్వాస్తోసహా 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దిఫూ నియోజకవర్గంలో కాంగ్రెస్ సిట్టింగ్ సభ్యుడు బీరేన్ సింగ్ ఎంగ్టి, బిజెపికి చెందిన జోయ్ రాం ఎంగ్లింగ్ తో సహా ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. త్రిపుర: రాష్ట్రంలోని రెండవ లోక్ సభ నియోజకవర్గానికి శనివారం ప్రారంభమైంది. మొత్తం 11.30 లక్షల మంది వోటర్లు తమ వోటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎస్టిలకు రిజర్వ్ అయిన ఈ స్థానంలో ఇద్దరు మహిళలతో సహా 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోటీ ప్రధానంగా సిపిఎం అభ్యర్థి జితేంద్ర చౌదరి, కాంగ్రెస్ అభ్యర్థి సుచిత్ర దేవ్ వర్మ మధ్యనే ఉంది. బిజెపి, టిఎంసి, ఎఎపి అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. సిక్కిం: రాష్ట్రంలోని ఏకైక లోక్ సభ స్థానానికి మొత్తం ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 3,62,326 మంది వోటర్లు కాగా అందులో 1,75,549 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలోని 538 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరుగుతోంది. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ సిట్టింగ్ ఎంపి ప్రేమ్ దాస్ రాయ్, కాంగ్రెస్కు చెందిన అకర్ ధోజ్ లింబు, బిజెపికి చెందిన నర్ బహదూర్ ఖతివారా, ఎఎపికి చెందిన కౌశల్ రాయ్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉంది.
Related