చెంగిచెర్ల ప్రభుత్వ పాఠశాల శిలావస్థకు చేరింది
అందుబాటులో ఉన్న రెండెకరాలు స్కూల్ కోసం కేటాయించాలి
బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డికి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ విజ్ఞప్తి
మేడిపల్లి – జనంసాక్షి
చెంగిచెర్లలో దశాబ్దాల కింద నిర్మించిన ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 600 మందికిపైగా విద్యార్థులు ఉన్నారని, తక్కువ స్థలంలో ఉన్న ఈ పురాతన పాఠశాల భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బోడుప్పల్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ తెలిపారు. గత పదేళ్ల నుండి చెంగిచెర్ల గ్రామంలో విపరీతంగా నివాస కాలనీలు పెరగడంతో భారీఎత్తున జనాభా పెరిగిందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నా సౌకర్యాల లేమితో వారిని తిరస్కరిస్తున్నారని చెప్పారు. చెంగిచెర్ల గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కోసం స్థలం కేటాయించి మంజూరు చేయాలని విన్నవించారు. గురువారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఈ విషయమై ఆమె మేయర్ దృష్టికి తీసుకెళ్లి మాట్లాడారు. ఉన్న విద్యార్థులకు ఆ భవనం ఏ మాత్రం సరిపోకపోగా.. వందల సంఖ్యలో పాఠశాలలో చేరేందుకు కొత్త అడ్మిషన్లు వస్తున్నాయని తెలిపారు. తగినన్ని క్లాస్ రూములు, స్థలం లేని కారణంగా విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోలేని పరిస్థితి ఉందన్నారు. అయితే, చెంగిచెర్లలో గతంలో స్మశాన వాటికకై రెండెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించగా.., రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏడెకరాల్లో ఉన్న స్మశాన వాటికను వైకుంఠధామంగా అభివృద్ధి చేసిందని, తర్వాత కేటాయించిన ఈ రెండెకరాల భూమి స్మశాన వాటికకు అవసరం లేకుండా నిరుపయోగంగా మారిందన్నారు. అక్కడ ప్రభుత్వ పాఠశాల నిర్మించేందుకు అనుకూలంగా ఉందని, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా సౌకర్యాలను పరిగణించి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కోరారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా పలు బహుళజాతి కంపెనీలు హెచ్ సిఎల్ కంపెనీవారు తమ నిధులతో పాఠశాల భవనాన్ని నిర్మించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ వెల్లడించారు.




