భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం ఉదయం 9 గంటలకు గోదావరి నీటి మట్టం 61.06 అడుగులకు చేరుకుంది. భద్రాచలం రామాలయం వద్ద కరకట్ట స్లూయిస్ లీక్ కావటంతో రామాలయం విస్టాకాంప్లెక్స్, దుకాణ సముదాయం, అన్నదాన సత్రం వరద నీటితో నిండిపోయాయి. అన్నదాన సత్రం వరద నీటితో నిండిపోయాయి. ఉత్తర వైకుంఠ ద్వారం, సీతారాముల కళ్యాణ మిథుల స్టేడియం వద్దకు వరదనీరు చేరుకుంది. వరద ఉద్ధృతికి కూనవరం, చర్ల వైపు రాకపోకలు స్తంభించాయి. కొత్తకాలనీ, సుభాష్‌నగర్ కాలనీలో పలు ఇళ్లు మంపునకు గురయ్యాయి. కూనవరం-వీఆర్‌పురం మధ్య ఉన్న శబరి వంతెన మొత్తం నీట మునిగిపోయింది. చింతూరు మండలంలోని ముక్కునూరు గ్రామం వరద ముంపునకు గురవ్వడంతో సుమారు 50 ఇళ్లు నీట మునిగాయి. పునరావాస కేంద్రాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుబాటులో ఉండాల్సిన జోనల్ అధికారులు గైర్హాజరయ్యారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో భద్రాచలం -పాల్వంచ డివిజన్‌లోని 562 గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. గోదావరి ఉద్ధృతి సాయంత్రానికి 65 అడుకులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.




