చర్ల : ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీని గోదావరి వరద ముంచెత్తుతోంది. వరద తీవ్రరూపం దాల్చడంతో మన్యంలోని చర్ల, వెంకటాపురం, వాజేడు, దుమ్ముగూడెం మండలాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయా మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చర్ల మండలంలోని వీరాపురంలో గోదావరి వరదల్లో సురేష్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. ప్రధాన రహదారులపై వరదనీరు చేరుతుండటంతో అధికారులు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులో 21 గేట్లు ఎత్తి ఉంచి 50వేల క్యూసెక్కుల మేర నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. ముంపు గ్రామాల్లోని వరద బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలను తరలిస్తున్నారు.




