హైదరాబాద్: తెలంగాణ అభివృద్దికి చంద్రబాబు చాలా కృషిచేశారని, హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ది జరిగిందంటే చంద్రబాబుతోనే సాధ్యమైందని తేదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. టీడీఎల్పీస కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తామని తెరాసతో పొత్తుపెట్టుకుంది వైఎస్సేనని, అధికారదాహంతో ఆనాడు చిన్నారెడ్డి నాయకత్వాన్ని ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు. సోనియా, వైఎస్ కుమ్మక్కై తెరాసతో పొత్తు పెట్టుకున్నారన్నారు. ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు అణగదొక్కిందీ కాంగ్రెస్ పార్టీ కాదా అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడతామని ఇంతవరకు పెట్టలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎవరికోసమని ఆయన ప్రశ్నించారు. సర్పంచులకు బీసి మహిళా రిజర్వేషన్ కల్పించడంలో తేదేపాలోనే జరిగిందరి ఆయన గుర్తుచేశారు.




