రంగు బయట పెట్టుకున్న జేపీ


ఎంతైనా సీమాంధ్రుడే కదా?
లోక్‌సత్తా చీఫ్‌పై ఈటెల ఫైర్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి) :
తెలంగాణను అడ్డుకోవడానికే లోక్‌సత్తా జాతీయాధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ మూర్ఖపు ప్రయత్నం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. జేపీ తనకు తాను మేధావి అనుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడిన జేపీకి చదువు వస్తదా జ్ఞానం ఉందా అని ఇక్కడి సమాజం ప్రశ్నిస్తుందని అడిగారు. ఆంధ్రా పార్టీ నేతలు ఒక్కొక్కరు తమ నిజస్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. కర్నూలులోఆయన చేసిన వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్‌ నేతలు కూడా పలువురు మండిపడ్డారు. ఆంధ్రా పార్టీల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈటెల సూచించారు. బాబు బాటలో జేపీ నడవడం దారుణమన్నారు. భౌగోళికంగా అన్ని రంగాలకు హైదరాబాద్‌ వేదిక అని తెలిపారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర నేతలు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 400 సంవత్సరాల క్రితమే హైదరాబాద్‌ గొప్ప నగరమన్న విషయాన్ని జేపీ గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. చంద్రబాబు డ్రామాలు ఇక సాగవు అని చెప్పారు. తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడిన లోక్‌సత్తా ఎమ్మెల్యే జయప్రకాశ్‌ నారాయణ చదువుకున్న మూర్ఖుడు అని రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాశ్‌ పేర్కొన్నారు. తెలంగాణపై విషం కక్కిన జేపీని తెలంగాణ లోక్‌సత్తా నాయకులు నిలదీయాలని డిమాండ్‌ చేశారు. డిసెంబర్‌ 9 ప్రకటనకు అడ్డుపడిన ఆయన తెలంగాణ ప్రజల 60 ఏండ్ల స్వప్నం సాకారమవుతున్న వేళ మరోసారి అడ్డుపడుతున్నారని ప్రకాశ్‌ నిప్పులు చెరిగారు. జేపీ ఏ ఒక్కరోజు తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడలేదని గుర్తు చేశారు. జేపీ కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకి అని తెలిపారు. రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న జేపీని తక్షణమే ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలన్నారు.  కర్నూలు రోడ్‌షోలో రెచ్చగొట్టే ప్రసంగం చేసిన లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణపై టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు డా. శ్రవణ్‌ తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు బాటలోనే జేపీ నడుస్తున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణకు జై కొట్టి.. సీమాంధ్రకు వెళ్లి నై అంటున్నారని కోపోద్రిక్తులయ్యారు. ఆంధ్ర నాయకులకు నరనరాన విషం ఉందని ఈ రోజుతో జేపీ నిజస్వరూపం బయటపడిందని చెప్పారు. అయితే జెపి కర్నూలులో మాట్లాడుతూ కాంగ్రెస్‌ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని ఒప్పుకోవద్దు. రాయలసీమ ప్రజలకు పౌరుషం లేదా? మొహంపై కోపంతో ముక్కును కోసుకుంటామా? ఢిల్లీ చేతిలో కీలుబొమ్మలుగా మారొద్దు. ఎవరిని అడిగి రాష్ట్రాన్ని విభజిస్తున్నారు. విభజనను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓట్లు, సీట్ల కోసం కొన్ని పార్టీలు గడ్డి తింటున్నాయి. రాష్ట్రాన్ని విభజిస్తే మన భవిష్యత్‌ నాశనం అవుతుందన్నారు. ఢిల్లీ నిర్ణయాన్ని ఆమోదించవద్దని, ద్రోహ చింతనతోనే తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టారన్నారు. 2004లో కాంగ్రెస్‌, 2009లో టీడీపీ తెలంగాణకు జై కొట్టి మనల్ని మోసం చేశాయి. ఏడున్నర లక్షల కోట్ల ఆదాయంలో మూడున్నర లక్షల కోట్ల ఆదాయం హైదరాబాద్‌ నుంచే వస్తోంది. హైదరాబాద్‌లో వచ్చే మిగులు అన్ని ప్రాంతాలకు పంపిణీ చేయాలి. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది సీమాంధ్ర వాళ్లే. విద్యా సంస్థలన్నీ అక్కడే పెట్టాం. కర్నూలు రాజధానిని త్యాగం చేశాం. హైదరాబాద్‌ వనరుల్లో మనకు వాటా రావాలని అన్నారు.

తాజావార్తలు