Tuesday, 3 November 2026

తుస్సుమన్న సీమాంధ్రుల సమావేశం


పలువురు గైర్హాజర్‌
భవిష్యత్‌ కార్యాచరణ మీకు చెప్పాల్సిన పనిలేదు
మీడియాపై కావూరి విసుర్లు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి) :
సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సభ తుస్సు మంది. పలువురు ప్రజాప్రతినిధులు ఈ సభకు గైర్హాజరయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చిర్రుబుర్రులాడారు. తమ భవిష్యత్‌ కార్యాచరణ మీకు చెప్పాల్సిన పనిలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. నేతల గైర్హాజరీపై స్పందిస్తూ తమలో భేదాభిప్రాయాలు లేవని తెలిపారు. అధిష్టానంపై తాము ఒత్తిడి తీసుకురావడం వల్ల రాష్ట్ర విభజన నిర్ణయంపై ఆంటోనీ కమిటీ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోందని చెప్పారు. రాష్ట్రం కలిసి ఉంటేనే అన్ని రకాలుగా మంచిదని అన్నారు. తమకు పార్టీ కన్నా ప్రజలే ముఖ్యమని అదే విషయాన్ని హైకమాండ్‌కు చెప్పబోతున్నామన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందని కేంద్ర మంత్రులు, ఎంపీలు శనివారం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, పళ్లంరాజు, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఎంపీలు కనుమూరి బాపిరాజు, ఎస్పీవై రెడ్డి, అనంతవెంకట్రామిరెడ్డి, లగడపాటి రాజగోపాల్‌, మాగుట శ్రీనివాసలురరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్టాన్న్రి సమైక్యంగా ఉంచేందుకోసం ఏం చేయాలనే దానిపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలు, సీమాంధ్రలో ఉద్యమం, రాజీనామాలు వంటి అంశాలపై చర్చ జరిగింది. సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించేందుకు రాజీనామాలు చేయాలా? వద్దా అన్న అంశంపై మల్లగుల్లాలు పడ్డారు. కొందరు చేద్దామని ప్రాతిపదించగా, మరికొందరు వద్దని వారించారు. మొత్తానికి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని ముగించేశారు. 2009లో ఆమరణ దీక్ష చేపట్టిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చనిపోతాడనే భయంతోనే అప్పుడు ప్రకటన వచ్చిందని తెలిపారు. జూలై 30 ప్రకటనతో అన్ని విధాలుగా నష్టం జరుగుతుందని అధిష్టానానికి ముక్తకంఠంతో చెప్పామని తెలిపారు. తమ ఒత్తిడి మేరకే రాష్ట్ర పరిస్థితులు తెలుసుకొనేందుకు ఆంటోనీ కమిటీ వేశారని వివరించారు. అన్ని వర్గాలు ఏకమై సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నాయన్నారు. తమ వాదనను మరోసారి వినిపించేందుకు ఢిల్లీ పెద్దల్ని కలవబోతున్నట్లు తెలిపారు. పార్టీ సర్వస్వమే కానీ అంతకన్నా ప్రజలే ముఖ్యమని చెప్పబోతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విభజనపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక కొన్ని పార్టీలకు నచ్చలేదని తెలిపారు. విభజనపై మంత్రుల కమిటీ వేస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు హావిూ ఇచ్చారన్నారు. విభజనను వ్యతిరేకించడంలో తాము అంతా ఏకతాటిపై ఉన్నామని, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని తెలిపారు. అధికార కాంక్ష తమకు లేదని స్పష్టం చేశారు. ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రజల పరిస్థితిని గమనించాలని హైకమాండ్‌ను కోరామని మంత్రి జేడీ శీలం తెలిపారు. ప్రభుత్వంపై ఆధారపడిన సామాన్యుల ఇబ్బందులను పరిష్కరించాలనే అంశంపై భేటీలో చర్చించామన్నారు. తమ వాదన తర్వాతే ఆంటోనీ కమిటీ పునరాలోచనలో పడిందనేది వాస్తవమని మంత్రి చిరంజీవి చెప్పారు.
బొత్స ఝాన్సీ డుమ్మా
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ ఎంపీల సమావేశానికి బొత్స ఝాన్సీ డుమ్మా కొట్టారు. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోని క్లబ్‌ హౌస్‌లో కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. అయితే, మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో భేటీకి హాజరైన ఝాన్సీ సమావేశం మధ్యలోంచే బయటకు వెళ్లిపోయారు. ఏదైనా పని ఉండి వెళ్లారా? లేక తన భర్త సత్తిబాబు సూచన మేరకు వెళ్లిపోయారా? అన్నది ఆసక్తికరంగా మారింది. హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ముందు నుంచీ చెబుతున్న బొత్స కుటుంబ సభ్యులు సమైక్య ఉద్యమానికి దూరంగా ఉంటున్నారు. ఇటీవల పార్లమెంట్‌లో ఎంపీలు స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనలకు దిగినా ఝాన్సీ మాత్రం వెనుకే కూడా ఉండిపోయారు. అందుకే ఆమెపై సస్పెన్షన్‌ వేటు పడలేదు. మరోవైపు, సీమాంధ్ర ఎంపీల సమావేశాలకు హాజరువుతూనే ఝాన్సీ ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండడం విశేషం. మరోవైపు, సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు చింతా శ్రీనివాస్‌, రాయపాటి సాంబశివరావు కూడా సమావేశానికి గైర్హాజరయ్యారు. తాను భేటీకి వెళ్లనని రాయపాటి ముందే ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *