గ్యాస్‌ ధర పెంపును విరమించండి

బిసి మహిళా సంఘాలు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 : గ్యాస్‌ ధరను 62 రూపాయలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని పలు బిసి మహిళా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీరని భారం మోపడమేనని ధ్వజమెత్తారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద కుటుంబాలు ముఖ్యంగా గృహిణులు సతమతమవుతుంటే గ్యాస్‌ ధర పెంపు దారుణమని విమర్శించారు. సోమవారం బిసి భవన్‌లో ధరల పెరుగుదలపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిసి మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కె.లక్ష్మి, బిసి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు లత, ఉపాధ్యక్షురాలు డి.లక్ష్మి, బిసి మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.నిర్మల ముదిరాజ్‌తో పాటు లక్ష్మీబాయి, లతాసింగ్‌, భాగ్యలక్ష్మి, శారదా ఉమాదేవి, జ్యోతి, శైలజ తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు పెట్రోల్‌, డిజీల్‌ ధరలు, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, వాటికి తోడు గ్యాస్‌ ధర పెంపు వల్ల నిరుపేదలపై వేలకోట్ల రూపాయల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు అదుపు చేయలేని, పేదలగోడు పట్టించుకోని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని వారు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఆధార్‌ కార్డులు లభ్యం కాలేదని బ్యాంకు లింకేజి లేకపోవడం వలన ఇప్పటికే సిలెండర్‌కు 1000 రూపాయల భారాన్ని మోస్తున్న కుటుంబాలపై గ్యాస్‌ ధర పెంపు దారుణమని విమర్శించారు. రూపాయికి కిలో బియ్యం ఇచ్చినంత మాత్రాన పేద కుటుంబాలు సుఖంగా జీవిస్తాయన్నది పాలకుల బ్రమ మాత్రమేనని, మిగతా వాటి సంగతేమిటని ప్రశ్నించారు. గ్యాస్‌ ధర పెంపును విరమించుకోవాలని, ఆధార్‌కార్డులు లభ్యం కాని వారికి గ్యాస్‌ సబ్సిడీ వర్తింప చేయాలని వారు డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

తాజావార్తలు