Thursday, 5 November 2026

కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రకటించాలి : ఆర్‌.కృష్ణయ్య

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 : భావి ప్రధానిగా బిజెపి పార్టీ నరేంద్ర మోడీని ప్రకటించడం పట్ల బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశంలో గల 65 కోట్ల మంది బిసిలకు గర్వకారణమని పేర్కొన్నారు. 66 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో 53 సంవత్సరాలు కాంగ్రెస్‌ పార్టే దేశాన్ని పాలించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రెండు శాతం జనాభాలేని మైనారిటీ వర్గానికి చెందిన మన్మోహన్‌ సింగ్‌ను రెండుసార్లు ప్రధానిగా చేసిన కాంగ్రెస్‌ 54 శాతం జనాభా ఉన్న బిసిల పట్ల చిన్నచూపు చూసిందని, బిసిలంటే ఓట్లు వేసే యంత్రాలు చూశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి పార్టీ బిసి వర్గానికి చెందిన నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన మాదిరిగా కాంగ్రెస్‌ పార్టీ కూడా బిసి అభ్యర్థిని ప్రధానిగా ప్రకటించి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. మోడీ అభ్యర్థిత్వాన్ని బిజెపి సీనియర్‌ నేత ఎల్‌కె అద్వాని వ్యతిరేకించడం తగదన్నారు. ఇది దేశంలోని 65 కోట్ల మంది బిసిల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని పేర్కొన్నారు. నరేంద్ర మోడీని ప్రధాని కావాలని దేశంలోని 90 శాతంకు పైగా ప్రజలు కోరుకుంటున్నారని తాజా సర్వేలు పేర్కొంటున్న విషయాన్ని గుర్తు చేశారు. మోజారిటీ ప్రజల గౌరవాన్ని ఏ నైతనైనా గౌరవించాలి తప్ప వ్యతిరేకించడం సరికాదన్నారు. అంతేకాకుండా ప్రతి మనిషికి కులం, మతం ఉందని మోడీని మత కోణంలో చూడడం సబబు కాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ పార్టీ కళ్లు తెరవాలని కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *