కేంద్రంపై ఒత్తిడి పెంచండి
టి.ప్రతినిధులకు కోమటిరెడ్డి సూచన
హైదరాబాద్, సెప్టెంబర్ 16 : కొందరు తెలంగాణ ప్రాంత మంత్రుల తీరుపై మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఆయన సిఎల్‌పి కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్ర నేతల కుట్రలవల్లనే తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆరోపించారు. తెలంగాణ మంత్రులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకంగా 46 రోజుల నుండి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి సీమాంధ్రలో ఉద్యమాన్ని ప్రోత్సహిస్తుంటే తెలంగాణ మంత్రులు చూస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి పుణ్యమా అని గత నెల రోజుల నుంచి సుమారు 16 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. దీనిపై తెలంగాణ మంత్రులు నోరు మెదపకపోవడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డితో జై తెలంగాణ అనిపించాలని లేదా ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేలా తెలంగాణ మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంశాన్ని ఇన్‌స్టంట్ దోసెగా అభివర్ణించిన ముఖ్యమంత్రిని ఎలా ప్రోత్సహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు తెలంగాణ అంటూ మరోవైపు తెలంగాణను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రితో విందు సమావేశాలను ఇక్కడి మంత్రులు ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. కొందరి తెలంగాణ మంత్రుల వైఖరి చూస్తుంటే సిగ్గువేస్తుందని అన్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలకు పాల్పడుతున్నా తెలంగాణ మంత్రులు పదవులను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రికి అణగిమణగి ఉన్నారని అన్నారు. మంత్రి పదవులను తృణప్రాయంగా తీసివేసి తెలంగాణ కోసం పోరాడాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. పదవులు ముఖ్యమో.. ప్రజలు ముఖ్యమో వారు తేల్చుకోవాలన్నారు. ఇప్పటికైనా తమ పదవులకు రాజీనామాలు సమర్పించి తెలంగాణ ప్రక్రియ వేగవంతమయ్యేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.



