ఏపీఎన్‌జీవోల సమ్మె చట్ట విరుద్ధం దేవీప్రసాద్

సిద్దిపేట, సెప్టెంబర్ 18 (జనంసాక్షి) :
ఏపీఎన్జీవోల సమ్మె రాజ్యాంగ విరుద్ధమని టీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో దేవీప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. ఒక ప్రాంత ఆకాంక్షకు వ్యతిరేకంగా సమ్మె చేయడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదన్నారు. 40 వేల మంది సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడి నుంచి పోవాల్సి వస్తుందని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడడం సరికాదన్నారు. ఆయన ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. గుప్పెడు మంది కోసం నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. ఈ నెల 29న హైదరాబాద్‌లో ఐకాస తలపెట్టిన సకల జనుల భేరికి అనుమతి సాధించాల్సిన బాధ్యత ఈ ప్రాంత మంత్రులపై ఉందన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోతే ఎలా అభివృద్ధి చెందవచ్చో ఈ సభ ద్వారా వివరిస్తామని చెప్పారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ బిల్లు ఆమోదానికి ఒత్తిడి పెంచాలని ఆయన కోరారు. లేకుంటే మరో ఉద్యమానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.



