సమైక్య బంద్ ముసుగులో పేదల బియ్యం బ్లాక్ మార్కెట్

ఆర్టీసీ బంద్.. కేశినేని, జేసీ బస్సులు ఫుల్
సామాన్యుల పొట్టకొడ్తున్న సమైక్య దొమ్మి
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (జనంసాక్షి) :
సమైక్య బంద్ ముసుగులో నిరుపేదల పొట్టగొడుతున్నారు పెత్తందారులు. పేదల బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుం టున్నారు. ఆర్టీసీ బస్సులు బంద్ చేసి సామాన్యులకు రవాణా సౌకర్యాలు లేకుండా చేస్తున్నారు. అదే సమైక్య ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న కేశినేని, జీసీ బ్రదర్స్ ట్రావెల్స్ మాత్రం యథేచ్ఛగా తిరుగుతున్నాయి. సమైక్యం పేరుతో పెత్తందారులు దొమ్మి చేస్తున్నారు. ఒక్కో పేదకు ప్రభుత్వం నెలకు నాలుగు కేజీల చొప్పున బియ్యం, అమ్మహస్తం పేరుతో తొమ్మిది నిత్యావసర వస్తువులను కూడా కేవలం 185 రూపాయ లకే సరఫరాచేస్తోంది. ఇది వినియోగించుకునేది కేవలం గుడిసెల్లో నివాసం ఉండేవారు, కూలీ పనులు చేసుకునే వారు నంటే అతిశయోక్తి అనిపించినా ముమ్మాటికి నిజం. సీమాంధ్రలో సకలం బంద్‌పేరుతో నిరుపేదలకు ప్రభుత్వ ఫలాలు అందకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు దూరం చేస్తున్నారు. సమైక్య రాష్ట్రం పేరుతో ఉద్యమాలు సృష్టించుకుని పెట్టుబడిదారులు, బడా వ్యాపారుల జేబులను మరింత పెంచడమే లక్ష్యంగా ఈఉద్యమాలు కొనసాగుతున్నాయనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో పేదల గురించి ఆలోచించాల్సిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, అధికారులు తమ కనీస బాధ్యతను కూడా నిర్వహిం చడంలేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తమకున్న అధికారాన్ని వినియోగించి నిరుపేదలకు సేవచే యాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సీమాంధ్రలో ఏ వ్యాపారాలు సాగుతలేనట్లుగా చిత్రీకరిస్తున్న బడా బాబులు తమ వ్యాపారాన్ని మాత్రం మూడుపువ్వులు ఆరుకాయలుగా చేసుకుంటూ పోతున్నారనేది నగ్నసత్యం. బహిరంగ మార్కెట్‌కే తప్పని పరిస్థితుల్లో పేద ప్రజలు వెళ్లి నిత్యావసర సరుకులతోపాటు బియ్యం కూడా కొనుగోలు చేసుకోవాల్సిన దుస్తితిని వీరు తేవ డాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. సీమాంధ్రలో డీలర్లు సైతం నిత్యావసర సరుకులకోసం డిడిలు చెల్లించారు. ఇహ వస్తాయా అహ వస్తాయా సరుకులు పంపిణీ చేసి కాస్తో కూస్తో సంపాదించుకుందామని ఎదురు చూస్తున్న వారి పరిస్థితి గడ్డుగా మారుతోంది. ఎంఎల్‌ఎస్ పాయింట్లకు కూడాచేర్చడంలో అధికారులు నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ నుంచి రీజియన్ల స్థాయి గోడౌన్లకు పంపించిన ప్రభుత్వం ఆతర్వాత వాటిని క్షేత్రస్థాయిలోకి పంపించడంలో శ్రద్ద చూపించక పోవడం దుర్మార్గం అంటున్నారు అక్కడి ప్రజలు. రెక్కాడితేగాని డొక్క నిండని కడుపేదరికంతో ఉన్న కూలీనాలి నేడు రేషన్ సరుకులపైనే ఆధారపడి ఉన్నారనేది ప్రతిఒక్కరికి తెలిసిన సత్యమే. అయినా కూడా సడలింపులు మాత్రం బడా నేతలకు, కఠినం మాత్రం పేదలకు ఎందుకు అనే ప్రతిఘటన ఉద్యమం ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో మూడుపూటలా కడుపు నిండా తిండి లభించే పరిస్థితిని కష్టార్జితం చేసుకుని పూర్తిచేసుకునేవారు. అయితే నేడు అందుకు బిన్నంగా పరిస్థితులు నెలకొని ఉండడంతో తీవ్రంగా కష్టపడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులకు ఇక్కట్లు కలుగకుండా చర్యలు తీసుకోవాలని రేషన్ సరుకులను గ్రామాలకు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేసినా కూడా సీమాంధ్రలో అధికారులు మాత్రం ఏమాత్రం ఖాతరు చేయక పోవడం దుర్మార్గం. నెలకు వేలకు వేల రూపాయల వేతనం తీసుకుంటున్న అధికారులు, ఉద్యోగులు మాత్రం యధేచ్చగా కడుపునిండా తింటూ కంటినిండా నిద్రతీస్తుంటే, తాము మాత్రం ఎందుకు కష్టాలు పడాలనే రీతుల్లో కడుపేద ప్రజలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈఆలో చనే ప్రతిఘటనకు దారి తీసే ప్రమాదాలు ఉన్నాయని సీమాంధ్రలో మేధావులు ఉద్యమాన్ని అతిదగ్గరగా చూస్తున్న వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్రలో 2861 హాస్టల్లకు ఉద్యమం పుణ్యమాని బియ్యంతోపాటు సరుకులు పంపిణీ అటకెక్కాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ,బిసి, మైనార్టీ విద్యార్థులను హాస్టల్ నిర్వాహకులు ఇళ్లకు పంపించి వేశారు. ఈహాస్టళ్లకు ఏడు వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎంఎల్‌ఎస్ స్టాక్ పాయింట్లలోనే మ్రగ్గుతున్నాయి. దీంతో 3.51లక్షల మంది విద్యార్థులు ఇళ్లబాట పట్టక తప్పని పరిస్థితి నెల కొంది. బహిరంగ మార్కెట్‌లో వస్తువులు, తినుసామాగ్రి అమ్ముతున్నప్పుడు రేషన్ షాపుల్లోకి సరుకులు ఎందుకు రావడంలేదని పేదలు పాలకులను, ప్రజాప్రతినిధులను నిలదీసే రోజులు అతిదగ్గరలోనే ఉన్నా యని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఆపరిస్థితి వచ్చిందంటున్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతిలాంటి పట్టణాల్లో లక్షలకు లక్షల వ్యాపారం యధేచ్చగా సాగుతున్నట్లు ప్రభుత్వ లెక్కలే చెపుతున్నాయి. సీమాంధ్రలో ఉద్యమాలు నిజమైతే ఈవ్యాపార సంస్థలు కూడా కొనసాగకుండా ఉండేవి. బడా వ్యాపారులకు కొమ్ముకాయడమే సీమాంధ్రుల ఉద్యమ లక్ష్యమా అనే భావన వ్యక్తం అవుతోంది. ఈఒక్కటే కాదు విద్య, వైద్యం, ప్రభుత్వ సేవలు అన్ని కూడా కేవలం పేదవారిని దూరం చేయడమే లక్ష్యంగా ఉద్యమం కొనసాగుతుందని ఎమ్మార్పీఎస్‌తోపాటు సిపిఐ, సిపిఎం పార్టీలు వేలెత్తి చూపిస్తున్నాయి.ఇవేవి పట్టనట్లుగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. ఈఆరోపణలే త్వరలో ప్రతిఘటనకు దారి తీసే అవకాశాలు మెండుగా ఉన్నాయని సీమాంధ్రలో అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఉద్యమం కాస్తా ప్రతిఘటనవైపు మారక ముందే సీమాంధ్ర నేతలు, ఆందోళనకారులు తమ వ్యవహారాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని మేధావులు సూచిస్తున్నారు.



