కొంతమందే అల్లర్లకు కారణం : ప్రధాన మంత్రి

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌లో ఇటీవల చోటు చేసుకున్న మతకలహాలు తీవ్రమైన విషాదంగా ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ పేర్కొంటూ కొంతమంది మాత్రమే ఇటువంటి సంఘటనలకు కారణమై సమస్యలు సృష్టిస్తున్నారని ఈ విషయాలపై అవసరమైన తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో విభిన్న మతాల ప్రజలు శతాబ్దాలుగా సెక్యూలర్‌ భావాలతో సహజీవనం కొనసాగిస్తూ అన్ని రంగాలలో పరోభివృద్ధి సాధించడానికి పురోగమిస్తున్నారని తద్వారానే దేశ సమగ్రత, సమైక్యత, మత సామరస్యత సాధించడం సాధ్యమవుతోందని ఆయన తెలియజేశారు. కేవలం కొంత మంది మాత్రమే మనలో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో విభజనను ప్రేరేపించే శక్తులను ప్రతిఘటించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిది అని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ మత సామరస్య అవార్డుల ప్రధానోత్సవ సభలో ప్రధాని ప్రసంగించారు. దేశంలోని పలు ప్రాంతాలలో మతఘర్షణల ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమం దేశ రాజధానిలో నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో మతకలహాల ఘటనలు చోటు చేసుకోవడం దేశంలో ప్రతి పౌరుడిని అప్రతిష్టకు గురి చేస్తుందని ఇటువంటి తరుణంలో సమాజంలో శాంతి సామరస్యాలు పరిడవిల్లే విధంగా కృషి చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన అన్నారు. దేశం శాంతి, సహనం, సమగ్రతలన వారసత్వంగా స్వీకరించి ఇతరుల అభిప్రాయాలను ఓర్పుతో గౌరవించే సంప్రదాయాన్ని కొనసాగిస్తుందని ఆయన దేశ స్వరూప స్వభావాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం దేశ సమగ్రత, సమైఖ్యత, మతసామరస్య పరిరక్షణకు కట్టుబడి ఉందని ఆయన తెలియజేస్తూ ఈనెల 23న నిర్వహించే జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో ఇంకా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలియజేశారు. మత సామరస్య అవార్డులను అందుకున్న ప్రముఖులను, సంస్థల సేవలను ప్రధాన మంత్రి కొనియాడుతూ వారి స్ఫూర్తితో సమాజంలోని పౌరులు ప్రేరణ పొంది తమ విద్యుక్త థర్మాలను నిర్వర్తిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.