వీకె సింగ్‌పై సీబీఐ దర్యాప్తు?

న్యూఢిల్లీ : పదవీ విరమణ పొందిన సైనిక దళాల ప్రధానాధికారి వికెసింగ్‌ ఏర్పాటు చేసిన రహస్య నిఘా విభాగం నిర్వహించిన చట్టవిరుద్ధ కార్యకలాపాలు, నిధుల దుర్వినియోగం పై ప్రభుత్వం సీబీఐతో దర్యాప్తు జరిపించే అవకాశం ఉంది. జనరల్‌ సింగ్‌ తన పదవిని దుర్వినియోగం చేసే ఏర్పాటు చేసిన టెక్నికల్‌ సర్వీసెస్‌ డివిజన్‌ (టిఎస్‌డి) కార్యకలాపాలపై బోర్డు ఆఫ్‌ ఎంక్వైరీ అందచేసిన నివేదికను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తర్వాలోనే ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వార్గాలు తెలిపాయి. టీఎస్‌డి నివేదికలో వెలుగు చూసిన నిజాలు ‘అత్యంత సున్నితమైనవ” ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి మనీస్‌ తీవారీ శుక్రవారం విలేకరులతో అన్నారు. ఈ వ్యవహారంతో రిటైరైన లేదా పదవిలో ఉన్న వ్యక్తులు ఎవరికైనా సంబంధముంటే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తూ ఒక వార్తా పత్రికలో వచ్చిక కథనాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్‌ అధికారుల  ఫోన్లను టిఎస్‌డి ట్యాపింగ్‌ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖకు ఇటీవలనే ఈ నివేదిక అందింది. త్వరలోనే టిఎస్‌డి వ్యవహారాల దర్యాప్తు రక్షణ శాఖ సిఫార్సు చేయనున్నదని వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, మాజీ సైనిక దళాల ప్రధానాధికారి వికె సింగ్‌పై వచ్చిన ఆరోపణలను బిజేపి తోసిపుచ్చింది. గుజరాత్‌ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడితో కలసి ఒక బహిరంగ సభలో పాల్గొన్నందుకే వికె సింగ్‌ను కేంద్రం వేధిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు.

తాజావార్తలు