Tuesday, 3 November 2026

ఇష్టంలేకుంటే పోండి


తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్‌
సీమాంధ్ర ఎంపీలపై మండిపడ్డ దిగ్విజయ్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) :
తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్‌ అని, ఇష్టం లేకుంటే వెళ్లిపోవచ్చని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారెవరైనా ఇష్టం లేకపోతే పార్టీని విడిచిపెట్టి పోవచ్చని గురువారం రాత్రి ఢిల్లీ లో తనను కలుసుకున్న సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల వద్ద దిగ్విజయ్‌ కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రక్రియను ముందుకు తీసుకెళితే పార్టీకి రాజీనామా చేస్తామని కొందరు నాయకులు బెదిరించినపుడు ఆయన ఈ ఘలక్‌ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  ” తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న తన నిర్ణయాన్ని అమలు చేయడంపై మేడమ్‌ సోనియా గాంధీ కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ విషయం తెలిసికూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ పార్టీ నాయకత్వాన్ని పదేపదే అడగడంలో అర్థం ఏమైనా ఉందా? పార్టీని వదిలి పెట్టాలని మీలో ఎవరికైనా ఉంటే అది మీ ఇష్టం ” అంటూ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు నామకత్వంలో గురువారం రాత్రి ఢిల్లీలో తనను కలుపుకున్న సీమంధ్ర ప్రజా ప్రతినిధులకు దిగ్విజయ్‌సింగ్‌ క్లాసు తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల సర్జరీ చేయించుకుని కోలుకుంటున్న కేంద్రరక్షణ మంత్రి ఎకె ఆంటోని విధులకు హాజరైన వెంటనే తెలంగాణ ప్రక్రియ వేగం పుంజుకుంటుందన్న మరో బాంబు కూడా దిగ్విజయ్‌ పేల్చినట్లు తెలుస్తోంది.” రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ప్రస్తావన ఇంకోసారి నా దగ్గర తీసుకురాకండి. రాష్ట్ర విభజన నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. అని దిగ్విజయ్‌సింగ్‌ చెప్పడంతో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు నీరుగారి పోయినట్లు తెలిసింది. ఏదైనా మాట్లాడదలచుకుంటే హైదరాబాద్‌ ప్రతిపత్తికి సంబంధించి ప్రత్యామ్పాయాలు సూచించండని ఆయన అడిగినట్లు తెలుస్తోంది. ఆంటోని కమిటీ తన నివేదిక ఎఐసీసీ నాయకత్వాన్ని సమర్పించేంతవరకు తెలంగాణ నోట్‌ కేంద్ర కేబినెట్‌కు రాకుండా నిలిపి వేయాలన్న సీమాంధ్ర నాయకుల విజ్ఞప్తిపై దిగ్విజయ్‌ ఎటువంటి హీమీ ఇవ్వలేదని తెలిసింది. గడచిన 50 రోజులుగా ఆందోళన చేస్తున్న సీమాంధ్ర ప్రజలను సంతృప్తి పరిచే విధంగా పార్టీ అధిష్టానం వర్గం నుంచి ఒక ప్రకటన చేయించాలన్న అభ్యర్థనను కూడా ఆయన తేలికగా తీసుకున్నట్లు సమాచారం. ”విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాత పార్టీ అధిష్టాన వర్గం తెలంగాణ పై నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని మీరు పదేపదే ఎలా వ్యతిరేకిస్తారు.” అని దిగ్విజయ్‌ వారిని ప్రశ్నించనట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో సమస్యలు ఏమైనా వస్తాయని ఎంపీలు భావిస్తే ఆ విషయాన్ని పార్టీకి వదిలేయాలని , సీమాంధ్రలో జరిగే ఎన్నికల్లో తమ నాయకులను ఎలా గెలిపించుకోవాలో పార్టీ నాయకత్వం ఆలోచించుకుంటుందని దిగ్విజయ్‌ వారికి సూచించినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అవలంబిస్తున్న సమైక్యాంధ్ర వైఖరిని కూడా దిగ్విజయ్‌ తప్పుపట్టినట్లు సమాచారం. తాను సీమాంధ్రాకు ముఖ్యమంత్రిలా కిరణ్‌ వ్యవహరిస్తున్నారని సీమాంధ్ర నాయకుల వద్ద దిగ్విజయ్‌ వ్యాఖ్యానించినట్లు వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యాఖ్యలతో దిగ్భ్రాంతి చెందిన సీమాంధ్ర ఎంపీలు ఢిల్లీ లోని పార్లమెంట్‌ కాంప్లెక్స్‌కు చెందిన సెంట్రల్‌ హాల్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. కాగా రాజీనామాలపై వారింకా ఒక నిర్ణయానికి రాలేకపోయారు. మళ్లీ సోమవారం సమావేశం కావాలని వారు నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం సాయత్రం సోనియా గాంధీ నాయకత్వం లో సమావేశమైన కాంగ్రెస్‌ కోర్‌కమిటీ తెలంగాణపై హౌమంత్రి శాఖ రూపొందించిన ముసాయిదా నోట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *