హైదరాబాద్ రాజధానిగా తెలంగాణే

ఉమ్మడికి ఒప్పుకోం
సకల జనభేరికి భారీగా తరలిరండి..
కోదండరామ్
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (జనంసాక్షి) :
తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్ అని, ఇష్టం లేకుంటే వెళ్లిపోవచ్చని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకొనేందుకు సీమాంధ్ర నేతలు కుట్రలు పన్నుతున్నారని.. రాష్ట్ర విభజన జరిగే వరకూ అప్రమత్తంగా ఉండాలని టీ-జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేసి సీమాంధ్ర కుట్రలను భగ్నం చేయాలని డిమాండ్ చేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయంలో ఎలాంటి తప్పిదం జరిగినా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలదే బాధ్యత అని హెచ్చరించారు. త్వరగా తెలంగాన ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ నెల 29న హైదరాబాద్‌లో సకల జనుల భేరీ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభ నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని చెప్పారు. సభకు ఇంటి నుంచి ఇద్దరి చొప్పున తెలంగాణ వాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తెలంగాణ ఆకాంక్షను చాటాలని పిలుపునిచ్చారు. ఈ నెల 29న నిర్వహించబోయే సకల జనుల భేరీ సభకు ప్రభుత్వం అనుమతి లభించిందన్నారు. తెలంగాణవాదులు లక్షలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. హైదరాబాద్ విషయంలో కేంద్రం కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్బాగమని స్పష్టం చేశారు. కేంద్రపాలిత ప్రాంతం, ఉమ్మడి రాజధాని అంటే ఒప్పుకొనే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సీమాంధ్ర నేతల ఒత్తిడి వల్లే షిండే హైదరాబాద్‌పై రెండు, మూడు అంశాలు ఉన్నాయని అంటున్నారని ధ్వజమెత్తారు. డిసెంబర్‌లోపు తెలంగాణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే తెలంగాణలో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయన్నారు. తెలంగాణకు న్యాయం చేయడంతో పాటు సకాలంలో న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా తెలంగాణ ఉద్యమం కొనసాగుతోందని, ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ అంశం ఉందని గుర్తు చేశారు. తెలంగాణపై ప్రకటన చేసి 50 రోజులు గడిచినా ఒక్క అడుగు ముందుకు పడలేదని.. కేంద్ర వైఖరి అనుమానాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ బిల్లు పాసయ్యే వరకూ మనమంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.



