తెలంగాణకే సై అంటున్న కేంద్రం
ముందు నుయ్యి.. వెనుక గొయ్యిఅధిష్టానం తీరుపై సీమాంధ్ర నేతల డీలా
రాజీనామాలపై తర్జనభర్జనలు
హైదరాబాద్, సెప్టెంబర్ 21 : సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. విభజన అంశంపై అధిష్టానాన్ని ఒప్పించలేక.. ఇటు జనాన్ని మెప్పించలేక దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. ప్రజల నుండి వస్తున్న ఒత్తిడి మేరకు రాజీనామాలు చేస్తామని చెబితే.. ఒకదశలో అధిష్టానం పెద్దలు కటువుగానే మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజీనామాలా.. చేస్తే చేసుకోండి అంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేయడంతో వారు కంగుతిన్నారు. ఏం చేయాలో పాలుపోక బిక్కముఖం వేశారు. హైదరాబాద్ విషయంలో కూడా ఇక తాము చేసేదేమి లేదని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. శుక్రవారం ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలను సీమాంధ్ర నేతలను దిక్కుతోచని స్థితికి నెట్టిపారేశాయి. అధిష్టానం రాజీనామాలకు సైతం వెనుకంజ వేయకపోవడంతో వారిలో కలవరం ప్రారంభమైంది. హైదరాబాద్ విషయంలో మీరే పరిష్కారం చూపండి అంటూ దిగ్విజయ్‌సింగ్ సీమాంధ్ర నేతలను ఎదురు ప్రశ్నించడంతో ఏం చెప్పాల్నో తెలియక సీమాంధ్ర నేతలు అయోమయంలో పడ్డారు. తెలంగాణ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్‌పై ఏం చెప్పాలో అర్థంకాక వారిలో వారే చర్చించుకుంటున్నారు. 400ఏళ్లు చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరాన్ని 60ఏళ్ల కింద వచ్చిన మనమే అభివృద్ధి చేశామంటే అందులో విశ్వసనీయన ఉండదని, వారే వెనుకడుగు వేస్తున్నారు. అందులోనూ మంత్రులు పనబాకలక్ష్మి, జేడీశీలం, కిషోర్‌చంద్రదేవ్ వంటి వారు రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. వారికెవరికి హైదరాబాద్‌తో పెద్దగా సంబంధాలు లేవని, ఇక్కడ ఆస్తులు కూడా లేవని లగడపాటి, రాయపాటి, మేకపాటి, కావూరి వంటి వారే ఎందుకు విభజనను వ్యతిరేకిస్తున్నారని అధిష్టానం పెద్దలు ప్రశ్నించడంతో వారు అవాక్కయినట్లు సమాచారం. కేవలం హైదరాబాద్‌లో అక్రమాస్తులు సంపాదించిన సీమాంధ్ర పెట్టుబడిదారులే విభజన నిర్ణయాన్ని పెద్దగా చూపుతున్నారని కేంద్రప్రభుత్వం కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అధిష్టానం కూడా స్పష్టంగా రాష్ట్ర విభజన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఢిల్లీలో మాట్లాడిన కేంద్ర మంత్రి మనీష్‌తివారి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాకోలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రక్రియ ముందుకే వెళుతుందని, దీనిపై రెండో ఆలోచన లేదని వారు స్పష్టంచేశారు. విభజన అంశం సున్నితమైందని, సుదీర్ఘకాలంపాటు పరిశీలనలు, చర్చలు జరిగాయని, అన్ని కోణాల నుండి ఆలోచించే విభజన నిర్ణయం తీసుకున్నామని, ఇక వెనక్కువెళ్లే ప్రశ్నేలేదని తేల్చి చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ తేదీ వెలువడిన తెలంగాణ ఏర్పాటుపై దాని ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ఎంపీల నుంచి రాజీనామాల ఒత్తిడులు వచ్చినా వారంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్నారు. దిగ్విజయ్‌సింగ్ అయితే మరీ కుండబద్దలు కొట్టారు. విభజనపై వెనక్కు తగ్గేదిలేదన్నారు. తెలంగాణ అంశంపై వేరే ఆలోచనకు ఆస్కారమే లేదని, మీరు విభజన అంశంపై మీరు మాట్లాడకపోవడమే మంచిదంటూ సలహా ఇచ్చారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు తాము రాజీనామాలు చేయకతప్పదంటూ సీమాంధ్ర నేతలు చెప్పగా.. ఆయన తీవ్రంగా స్పందించారు. రాజీనామాలు చేయాలనుకుంటే చేసుకోండి.. ఇక నాతో మాట్లాడాల్సిన పనిలేదంటూ దిగ్విజయ్ లేవబోయారు. దీంతో సీమాంధ్ర నేతలు కంగుతిన్నారు. ఏదేమైనా అధిష్టానాన్ని మెప్పించలేక.. ఇటు ప్రజల ఒత్తిడిని తట్టుకోలేక సీమాంధ్ర నేతల పరిస్థితి ముందునుయ్యి వెనుక గొయ్యిలా మారింది.



