అత్యాచార కేసులను సత్వరం పరిష్కరించాలిల

బిజెపి మహిళామోర్చ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21 : దేశంలో, రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై జరిగే అత్యాచారాలపట్ల బిజెపి మహిళామోర్చ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. వీటన్నింటికి ప్రభుత్వాలే పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. నిద్రలేచి ఏ పత్రిక చూసినా, టీవీ ఛానల్‌ చూసినా మహిళలపై అత్యాచారాలు ప్రతినిత్యం దర్శనమిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అత్యాచారాలకు సంబంధించిన కేసులు సత్వరం పరిష్కారం కాకపోవడం, దోషులకు సరైన శిక్ష పడకపోవడం మూలంగా వాటికి అడ్డూ అదుపు లేకుండా పోతుందన్నారు. అత్యాచార కేసులన్నింటినీ వెంటనే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ద్వారా 120 రోజుల్లో పరిష్కరించాలని మాలతీరాణి డిమాండ్‌ చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉమ, మహిళామోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరెడ్డి, కార్యదర్శి జి.విజయలక్ష్మి, గీతారాణిలతో కలిసి మాట్లాడారు. యువతలో విచ్చలవిడితనం పెరగడానికి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలే కారణమని ఆరోపించారు. అతిగా మద్యం అమ్మకాలు సాగించడం, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని చూసి చూడనట్లు వదిలివేయడం, పబ్‌లవంటి వాటిని ప్రోత్సహించడం ఈ విష సంస్కృతికి ఆజ్యం పోస్తున్నారని దుయ్యబట్టారు. స్త్రీ అంటే మాతృత్వానికి ప్రతీక అని మన దేశ సంస్కృతి, శాస్త్రాలు చెబుతున్నప్పటికీ రాక్షసత్వం పెరగడానికి సరైన విద్యాబోధన లేకపోవడం, తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా కారణమన్నారు. స్త్రీలంటే గౌరవం, విలువలతో కూడిన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. స్త్రీ పట్ల గౌరవం పెంపొందే విధంగా పాఠ్యాంశాలు రూపొందించాలని మాలతీరాణి డిమాండ్‌ చేశారు. నగదు బదిలీ పథకం నుండి గ్యాస్‌ను మినహాయించాలని, గ్యాస్‌కు ఆధార్‌కార్డు అనుసంధానాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఈనెల 23న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల, పట్టణాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

తాజావార్తలు