Wednesday, 4 November 2026

మాది టీటర్నే: కిషన్‌రెడ్డి

ఆప్షన్ల జోలికెళ్తే కాంగ్రెస్‌కు ఏ ఆప్షన్‌ లేకుండా చేస్తారని హెచ్చరిక

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీరాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం సమక్షంలో పలువురు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణపై తాము యూటర్న్‌ తీసుకోలేదని, ఎప్పటికీ టీటర్నే అని చెప్పారు. మొదటి నుంచి తమ పార్టీ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఒక ఓటు, రెండు రాష్ట్రాలు అని కాకినాడ తీర్మానంలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. మిగతా పార్టీల్లా రోజుకో మాటమార్చబోమని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ చిన్నరాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమని చెబుతూ.. ఎన్డీఏ హయాంలో నాలుగు రాష్ట్రాల ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీలు ఊసరవెల్లుల రంగులు మార్చుతున్నాయని, ఇరు ప్రాంతాల ప్రజలను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఆ పార్టీల వైఖరిని చూసి ఊసరవెల్లులు సైతం సిగ్గుపడుతున్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌పై మూడు ఆప్షన్లు ఉన్నాయని చెబుతున్న కాంగ్రెస్‌కు.. మాట తప్పితే కాంగ్రెస్‌కు ప్రజలు ఏ ఆప్షన్‌ లేకుండా చేస్తారని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ భూస్థాపితం కావడం ఖాయమని చెప్పారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు సైతం ఓటమి పాలయ్యే జాబితాలో ఉన్నారని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, సీపీఐ కార్యదర్శి కె.నారాయణ తమ పార్టీపై చేసిన విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మోడీని ప్రధానిగా యువత చూడాలనుకుంటోందని చెప్పారు. గణేష్‌ ఉత్సవాలను తాము రాజకీయం చేయలేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *