సమ్మె విరమించం
కోర్టుకు తెలిపిన ఏపీఎన్జీవోలు
కేసు సోమవారానికి వాయిదా
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (ఎపిఇఎంఎస్):ఏపీఎన్జీవోలు చేస్తున్న సమ్మెను విరమించాలని హైకోర్టు సూచించింది. శనివారం ఏపీఎన్జీవోల సమ్మె విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాన్ని విభజిస్తూ అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదని, ఆ ప్రకటనను ప్రధాని చేయాల్సి ఉంటుందని అయినా ఏపీఎన్జీవోలు సమ్మెకు దిగడంలో అర్థంలేదన్నారు. సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని తొలగించేందుకు సమ్మెను విరమించాలని కోరింది. రాష్ట్ర విభజన అంశం కొంతమంది ఆలోచన మాత్రమేనని వారి ఆలోచన మేరకు సమ్మెకు దిగడం సరికాదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. సమ్మె వల్ల రాష్ట్రంలో అన్ని రకాలుగా అభివృద్ది, సేవలు నిలిచిపోతాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే, తాము సమ్మెను కొనసాగిస్తామని ఏపీఎన్జీవోల తరపున న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. తమ డిమాండ్లే కాకుండా విభజన పట్ల సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందని, దీన్ని నివారిచేందుకే ప్రజలతో కలసి తాము ఉద్యమిస్తున్నామని వివరించారు. విభజనపై కేంద్రం ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదన్నారు. అధికారికంగా ఎవరైనా ప్రకటన చేసి ఉంటే రికార్డు చూపించాని, రాజకీయ నిర్ణయాన్ని ఉద్యోగులు సవాల్ చేస్తున్నారంటే కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ప్రభుత్వం నుండి స్పష్టత వచ్చేంత వరకు తాము సమ్మె విరమించేది లేదని ఏపీఎన్జీవోలు కోర్టుకు నివేదించారు. అయితే కేసును సోమవారం కోర్టుకు వాయిదా వేసింది.



