హైదరాబాద్, సెప్టెంబర్ 20 : వైఎస్ ఆశయసాధన మేరకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తెలిపారు. కేవలం జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేకే కాంగ్రెస్ పార్టీ విభజన చేస్తోందని ఆమె మండిపడ్డారు. వైఎస్ హయాంలో అన్ని ప్రాంతాలలో సమానంగా అభివృద్ది చేశారన్నారు.. ఆయన బతికుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లలా చూసి, అందరూ నావాళ్లే అని భావించి రాష్ట్రాన్ని ముందుకు నడిపారని చెప్పారు. అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందేలా చేశారన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకున్నారని వివరించారు. ఇప్పటికి తెలంగాణ ప్రజలు తమను అభిమానిస్తున్నారని, మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేవలం రాజకీయ లబ్దికోసమే కాంగ్రెస్ రాష్ట్రంలో చిచ్చురేపిందని దుయ్యబట్టారు. విభజన ప్రక్రియను ఆపేవరకు ఉద్యమం చేస్తామన్నారు. తెలుగుప్రజలను విడగొట్టే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. రాష్ట్రం విడిపోతే ఇరుప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, హైదరాబాద్‌లో సీమాంధ్రుల పాత్ర అనేకం ఉందని, దాన్ని మరిచిపోయి రాష్ట్రాన్ని విభజించి హైదరాబాద్‌ను సీమాంధ్రులకు దూరం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.




