డీజీపీకి చుక్కెదురు


సాగనంపేందుకే సర్కారు నిర్ణయం
నూతన డీజీపీ రేసులో ప్రసాద్‌రావు, హుడా, అరుణ్‌ బహుగుణ
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) :

చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకుని పదవీకాలాన్ని పొడిగించుకుందామనుకున్న డీజీపీకి చుక్కెదురైంది. సమైక్య ఉద్యమానికి మద్దతుగా సీఎం కిరణ్‌ చెప్పినట్టల్లా చట్టాలను తుంగలో తొక్కుతూ వచ్చిన డిజిపికి ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. తాను కిరణ్‌ అడుగులకు మడుగులొత్తుతూ ఉంటే పదవి ఎటూ పోదనే ధీమాతో వ్యవహరించిన దినేష్‌రెడ్డికి కిరణ్‌ ఇచ్చిన షాక్‌ గట్టిగానే తాకింది. తనను చట్టం ప్రకారం మరో సంవత్సరంపైగా డిజిపిగా కొనసాగించాల ని క్యాట్‌ను ఆశ్రయించిన దినేష్‌రెడ్డికి ప్రభుత్వం చెంపదెబ్బ కొట్టినంత పని చేసింది. తాము మరో వ్యక్తిని డిజిపిగా నియమించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం తన వాదనను వినిపించింది. ఈనెల 30వ తేదీన నూతన వ్యక్తిని నియమించనున్నామని కూడా పేర్కొనడంతో దినేష్‌రెడ్డి ఆశలు అడియాశలు అయ్యాయని చెప్పవచ్చు. నూతన డిజిపిగా ఏసిబి డిజి ప్రసాదరావు, హుడా, టిపిదాస్‌, అరుణ బహుగుణలు ఉన్నట్లు వినిపిస్తోంది. ముఖ్యమంత్రి మాత్రం ప్రసాదరావువైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత క్యాట్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.