మ్యాచ్‌ ముగిసింది.. తెలంగాణ గెలిచింది

ఇంకేమాడుతావ్‌? : శ్రీధర్‌బాబు
వరంగల్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్‌బాబు తిప్పికొట్టారు. ‘మ్యాచ్‌ అయిపోయింది.. తెలంగాణ గెలిచింది. ఇక మిగిలింది రిప్లే మాత్రమేనని’ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అంశంపై మ్యాచ్‌ చివరి బాల్‌ వరకూ ఉంటుందన్న కిరణ్‌ వ్యాఖ్యలపై శ్రీధర్‌బాబు పైవిధంగా కౌంటర్‌ ఇచ్చారు. గురువారం వరంగల్‌ జిల్లాలో పర్యటించిన శ్రీధర్‌బాబు విలేకరులతో మాట్లాడారు. సీడబ్ల్యూసీ నిర్నయంతోనే తెలంగాణపై మ్యాచ్‌ ముగిసిందని అన్నారు. లాస్ట్‌బాల్‌ ఉన్నప్పుడే సీడబ్ల్యూసీ తెలంగాణపై నిర్ణయం తీసుకుందని, ఇక గేమ్‌ ముగిసినట్లేనని వ్యాఖ్యానించారు. విభజన వల్ల సమస్యలు తలెత్తుతాయన్న సీఎం వ్యాఖ్యలపై స్పందిస్తూ.. చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చన్నారు. నదీజాలాలు, ఇతర సమస్యలపై చర్చించి పరిష్కారం కనుగొందామని సీఎంకు సూచించారు. రాష్ట్రపతి పాలన అవసరం లేదని, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య బద్దంగానే తెలంగాణ ఏర్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో సహా పార్టీ నేతలంతా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కిమటీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు తథ్యమని, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణను ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తాజావార్తలు