గడ్డితిన్న కేసులో లాలూకు అయిదేళ్ల జైలు

జగన్నాథ్‌్‌మిశ్రాకు నాలుగేళ్లు
రాంచీ, అక్టోబర్‌ 3 (జనంసాక్షి):
డబ్బుకు కక్కర్తి ‘గడ్డి’ తిన్న రాజకీయ నేతలకు జైలుశిక్ష ఖరారైంది. దాణా కుంభకోణం కేసులో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌యాదవ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే, మూగజీవుల పొట్టకొట్టి దోచుకున్న ఆయ నకు న్యాయస్థానం రూ.25 లక్షల జరిమానా కూడా విధించింది. అలాగే, మరో మాజీ ముఖ్య మంత్రి జగన్నాథ్‌ మిశ్రాకు కూడా కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరిం చింది. దాదాపు రెండు దశాబ్దాల కిందటి దాణా కుంభకోణం కేసులో లాలూ సహా 45 మంది నిందితులను రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం దోషులుగా నిర్ధారించింది.శిక్షల ఖరారుపై గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో వాదనలు జరిగాయి. లాలూ వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని, ఆయనపై సానుభూతితో వ్యవహరించాలని లాలూ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. మానవత్వంతో వ్యవహరించి సాధ్యమైనంత మేరకు శిక్ష తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఆ వాదనను సీబీఐ తిరస్కరించింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దోషులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించిన న్యాయమూర్తి.. తీర్పును కూడా వారికి వినిపించారు. కాగా, సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును తాము హైకోర్టులో సవాలు చేస్తామని ఆర్జేడీ ప్రకటించింది.
లాలూ మెడపై అనర్హత కత్తి..
దాణా కుంభకోణం కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన లాలూప్రసాద్‌ యాదవ్‌కు మరో చిక్కు వచ్చి పడింది. ఆయన లోక్‌సభ సభ్యత్వానికి ముప్పు వచ్చింది. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన చారిత్రక తీర్పు నేపథ్యంలో లాలూపై అనర్హత వేటు పడనుంది. వివిధ కేసుల్లో దోషులుగా తేలి రెండుళ్లకు పైగా జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధులు తక్షణమే అనర్హతకు గురవుతారని, ఆరేళ్ల పాటు వారు ఏ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు మార్గదర్శకాలను అడ్డుకొనేందుకు ఆర్డినెన్స్‌ రూపంలో యత్నించిన కేంద్ర ప్రభుత్వం ఇంటా బయటా విమర్శలతో వెనక్కు తగ్గింది. దీంతో లాలూప్రసాద్‌ యాదవ్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. అలాగే, ఆరేళ్ల పాటు ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు కానున్నారు.

తాజావార్తలు