ఖైరతాబాద్ 🙁 హైదరాబాద్ ): ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసిన సంఘటన ఖైరతాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ..ఖైరతాబాద్ ఆనంద్‌నగర్‌లోని రేణుకా అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉండే సవిత (35) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఉపాద్యాయురాలిగా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఆమె ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తలుపు తట్టి ఆమె మామయ్య రామకృష్ణ ఉన్నారా అంటూ ప్రశ్నిస్తూ లోపలికి వచ్చాడు. ఆమే లేరని తలుపు మూయబోతుండగా కత్తితో పొట్టలో పొడిచి పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను స్థానికులు పోలీసుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ఇంటి తలుపు మీద ఉన్న నేమ్‌ప్టేట్ ఆధారంగా రామకృష్ణ పేరుతో పిలిచి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




