సోనియా బర్త్‌డే గిఫ్ట్‌గా తెలంగాణ
డిసెంబర్ 9న పార్లమెంట్‌లో బిల్లు
అన్ని ఫైళ్లు చకచకా..
ప్రధానితో గవర్నర్ భేటి
సోనియా రాష్ట్రపతితో మంతనాలు
హైదరాబాద్, అక్టోబరు 24 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతం అవుతోంది. 2013 డిసెంబరు 9న సోనియా జన్మదిన కానుకగా పార్లమెంట్ ముందుకు తెలంగాణ బిల్లు తీసుకొచ్చి ఆమోదింపజేయా లన్న లక్ష్యంతో వడివడిగా కేంద్రం అడుగులు వేస్తోంది. తెలంగాణ అంశంపై చర్చించేందుకు ఏఐసీసీ అధినేత్రి సోని యాగాంధీ గురువారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలుసుకు న్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తెలంగా ణ బిల్లుపై ప్రణబ్‌ముఖర్జీ తమకు అనుకూలంగా వ్యవహరి స్తారంటూ సీమాంధ్ర మంత్రులు భావిస్తున్నారు. ఈ మేరకు గురువారం ప్రణబ్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించా రు. వారు ప్రణబ్‌ను కలవక ముందే సోనియాగాంధీ ఆయ నతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సందర్భంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా ప్రధానితో ముమ్మరంగా చర్చలు జరిపారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలంగాణ అంశంపై చర్చించేందుకు సమావేశం అవుతున్నారు. ఈ పరిణామాలన్నీ ప్రక్రియ వేగవంతానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే గవర్నర్ నరసింహన్ హోంమంత్రి షిండే, సోనియాగాంధీ, రాష్ట్రపతి ప్రణబ్‌లను బుధవారమే కలుసుకొని వేగంగా విభజన ప్రక్రియ చేపట్టాలని సూచించారు. విభజన కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందంలో కీలక సభ్యులైన సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం, నారాయణస్వామి , ఇంటెలిజెన్స్‌బ్యూరో ఇబ్రహీం, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో కూడా కలుసుకున్నారు. ఆయన షిండేకు ఒక నివేదిక కూడా సమర్పించారు. వేగంగా ప్రక్రియ పూర్తి చేయకపోతే సీమాంధ్రలో అనుకోని పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి తీరుపై సోనియాగాంధీకి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేయవచ్చనే అనుమానాన్ని కూడా ఆయన సోనియా ముందు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కచ్చితంగా డిసెంబరు9వ నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావడంతో పాటు బిల్లు ఆమోదం పొందనున్నట్లు సమాచారం. అయితే, డిసెంబరు 5వ తేదీ నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల తొలి రెండు రోజుల్లో బిల్లును సభ ముందుంచి డిసెంబరు 9నాటికి బిల్లును ఆమోదిస్తారా? లేక డిసెంబరు 9నాడే పార్లమెంట్‌లో బిల్లు తీసుకువస్తారా అనేది తేలాల్సి ఉంది. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందాలంటే బీజేపీ మద్దతు అత్యవసరం. అయితే, బిల్లు విషయంలో బీజేపీ యూ టర్న్ తీసుకుంటుందనే ప్రచారం ఈ మధ్య కొనసాగింది.
రాష్ట్రంలో టీడీపీతో పొత్తు కుదుర్చుకునేందుకే ఆ పార్టీ అగ్రనేత వెంకయ్యనాయుడు సామాజిక కోణంలో ప్రయత్నాలు చేశారనే వార్తలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే తెలంగాణ బిల్లుపై వెనుకడుగు వేస్తుందని, దీనికి ప్రధాన సూత్రధారి వెంకయ్య నాయుడు ఉద్దేశంతో ఆ పార్టీ శాసనపక్షం నేత యెండెల లక్ష్మినారాయణ తెలంగాణ సారధ్య కమిటీ చైర్మన్ డాక్టర్ రాజేశ్వర్‌రావు వంటి వారు పార్టీ అంతర్గత సమావేశాల్లో వెంకయ్యను నిలదీశారు. ఈ విషయాన్ని జాతీయ నాయకత్వాన్ని కూడా ఫిర్యాదు చేశారు. దీంతో వెంకయ్యనాయుడు టీడీపీతో పొత్తు ఉండదనే ప్రకటన చేశారు. దీంతో తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంతో పాటు కొత్తరాజధాని ఏర్పాటుకు భారీగా నిధులు కేటాయించాలని కూడా బీజేపీ డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా డిసెంబరు 9న సోనియా జన్మదిన కానుకగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.