Tuesday, 3 November 2026

జేసీ ట్రావెల్స్‌పై బిగుస్తున్న ఉచ్చు

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకున్న వోల్వో బస్సు ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర రవాణాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనలో 45 మంది అగ్నికి సజీవదహనమయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు , నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం జబ్బర్‌ ట్రావెల్స్‌ తప్పిదమైనప్పటికి …బస్సు మాత్రం జేసీ దివాకర్‌ ట్రావెల్స్‌కు సంబంధించినదిగా అధికారులు గుర్తించారు. సదరు బస్సును తాము 2011లోనే అమ్మేశామంటూ చేతులు దులుపుకుంటున్న జేసీ ట్రావెల్స్‌ యాజమాన్యం ..జబ్బర్‌ ట్రావెల్స్‌ పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయించుకోకపోవడంతో జేసీ ట్రావెల్స్‌పై చర్యలకు రవాణా అధికారులు సమాయత్తమవుతున్నారు. బస్సుకు సంబంధించిన లావాదేవీల సంగతి అటుంచితే…. పర్మిట్‌ మాత్రం జేసీ సంస్థకే ఇచ్చాం కాబట్టి అదే సంస్థపై కేసు నమోదు చేసే అవకాశాలున్నట్లు ఆ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచనప్రాయంగా చెప్పారు. రెండు ట్రావెల్స్‌ లావాదేవిలపై తమ దగ్గర కూడా ఎటువంటి సమాచారం లేదని ఆయన అంటున్నారు. ప్రమాదానికి గురైన బస్సుపై జబ్బర్‌ ట్రావెల్స్‌ అని రాసి ఉన్నప్పటికి ఈ బస్సు రిజిస్ట్రేషన్‌ ,ఓనర్‌ షిష్‌ మాత్రం జేసీ ట్రావెల్స్‌ పేరు మీదనే ఉండడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది., అంతేకాకుండా ట్రావెల్స్‌ పేరును మార్చి జేసీ సంస్ధనే ఈ బస్సును నడుపుతున్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నేపథ్యం వున్నందున ఈ కేసు కీలక మలుపులు తిరుగుతుందో లేక అన్ని కేసుల్లానే ఇది కూడా అటకెక్కుతుందో వేచి చూడాల్సిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *