జీవోఎం విధివిధానాలపై కోర్‌కమిటీ భేటీ
సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకే విభజన ఉండాలి
మేడమ్ దిశానిర్దేశం
న్యూఢిల్లీ, నవంబర్ 22 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై మంత్రుల బృందం విధివిధానాలు ఖరారు చేసేందుకు శుక్రవారం కాంగ్రెస్ కోర్‌కమిటీ ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో భేటీ అయింది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మన్మోహన్‌సింగ్‌తో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే, చిదంబరం, ఏకే ఆంటోనీ, కపిల్ సిబల్, సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈమేరకు మంత్రుల బృందం సిద్ధం చేసిన నోట్‌ను షిండే అధినేత్రికి సమర్పించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వచ్చే సాధారణ సమస్యలు, వివాదాలు, న్యాయ, రాజ్యాంగబద్ధ అడ్డంకులపై లోతుగా చర్చించారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేసే హైదరాబాద్ పరిధి, హోదాపై సమాచారం సేకరించినట్టుగా తెలిసింది. ఈ యేడాది జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానానికి లోబడి జీవోఎం ప్రతిపాదనలుండాలని ఈ సందర్భంగా అధినేత్రి ఆదేశించినట్టు తెలుస్తోంది. గంటన్నరపాటు జరిగిన సమావేశంలో రాష్ట్ర విభజన తర్వాత ఆర్టికల్ 371(డి) అధికరణం కొనసాగింపుపై కపిల్ సిబల్ కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. హైదరాబాద్‌తో పాటు భద్రాచలం రెవెన్యూ డివిజన్‌నూ తెలంగాణలో కొనసాగిస్తూ సీమాంధ్ర ప్రాంతానికి ఆకర్షణీయమైన ప్యాకేజీ ప్రకటించాలని కోర్ కమిటీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈనెల 25, 26 తేదీల్లో మరోసారి సమావేశమై జీవోఎం నివేదికకు తుది రూపు ఇవ్వనున్నారు. 28న ఆ నివేదికను జీవోఎం కేబినెట్‌కు సమర్పించనుంది.