శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు

జీవోఎంకు సోనియాహుకుం
న్యూఢిల్లీ, నవంబర్‌24 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిందేనని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టిని ఆదేశించినట్టు ఢీల్లిలో జోరుగా ప్రచారం సాగుతుంది. లేని పక్షంలో తప్పుడు సంకేతాలు వెళతాయని, మొదటికే మోసం వచ్చే ప్రమాదం కూడా వుందని ఆమె హెచ్చరించినట్టు సమాచారం. తెలంగాణ బిల్లుపై రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయం చెప్పడానికి కనీసం రెండు వారాలైనా సమయం ఇవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్‌ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌, 371డి అంశాల పరిష్కారం ఇప్పటికి సాధ్యం కాలేదని కొందరు చెప్పినా విభజన బిల్లును తదుపరి ప్రత్యేక సమావేశాలకో, లేక మార్చిలో జరిగే బడ్జెట్‌ సమావేశాలకో వాయిదా వేయడం మంచిది కాదని సోనియా కోర్‌ కమిటి భేటిలో వెల్లడించినట్టు సమాచారం. వాయిదా వల్ల ఏ ఉపయోగమూ లేకపోగా, నష్టాలే ఎక్కువని సోనియా టీమ్‌ వాదించినట్లు తెలుస్తుంది. సమావేశాల్లోనే బిల్లుని ప్రవేశపెడతామని మనం పదే పదే ప్రకటిస్తూ వచ్చాం. ఇప్పుడు అలా చేయకపోతే మాట తప్పినవాళ్లం అవుతాం. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆగిపోయిందనే అభిప్రాయం ప్రబలడానికి అవకాశం ఇస్తుంది. ఈ పరిణామం తెలంగాణలో అశాంతికి దారితీయడమే కాదు. సీమాంద్ర నేతలు మనపై మరింతగా ఒత్తిడి పెంచడానికే కారణమవుతుందని సోనియా బృందం అభిప్రాయపడింది. పేరుకు పదిహెను రోజులున్నా (డిసెంబరు 5-20) పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు పట్టుమని పది రోజులు కూడా జరిగేట్టు కనిపించడం లేదని, ఇంత తక్కువ వ్వవధిలో బిల్లుకు ఆమోదం పొందడం అసాధ్యమని కొందరు వాదించారు. మనం ఇప్పుడు బిల్లు పెట్టకుండా బడ్జెట్‌ సమావేశాల గురించి ఆలోచిస్తే, బిజేపి అడ్డం తి రిగే అవకాశాలు కుడా ఉంటాయి. ఓట్లు, సీట్లు దృష్టితోనే ఎన్నికలకు రెండు నెలల ముందు బిల్లు ప్రవేశపెట్టాలని ఆరోపిస్తూ, దీనికి తాము మద్దతివ్వలేమని బీజేపి తిరకాసు పెట్టోచ్చు. ఈ రెండు నెలల్లో కొంపలేం మునిగిపోవని, ఎన్నికల తర్వాతా ఆలోచిద్దామని అనోచ్చు. దినివల్ల కథంతా మొదటికి వస్తుంది. అదే జరిగితే రాష్ట్ర విభజన పూర్తి చేయలేక మనం అభాసుపాలవుతాం. రాజకీయంగా కూడా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అవుతుందని సోనియా వాదనను సమర్థించే పార్టీ ముఖ్యులు హెచ్చరించారు. శీతకాల సమావేశాల్లోనే బిల్లును ఒకేసారి ఉభయ సభల్లో ప్రవేశపేట్టి కనీసం రాజ్యసభలో తోలుత ఆమోదం పొందడం శ్రేయస్కరమని వారు సూచించారు. దీంతో శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే ఆలోచనలో సోనియా గాంధీ ఉన్నారని ఆమోదందాకా వెళ్లపోయినా ఓకేనని, కనీసం పార్లమెంటుకు సమర్పిద్దామని ఆమె అన్నట్లు తెలుస్తోంది.