Monday, 2 November 2026

తరుణ్‌ తేజ్‌పాల్‌కు ఊరట

బెయిల్‌పై విచారణ ముగిసే వరకూ స్టే
పనాజి, నవంబర్‌ 29 (జనంసాక్షి) :
లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ సంపాదకుడు తరుణ్‌ తేజ్‌పాల్‌కు గోవా సెషన్స్‌ కోర్టులో ఊరట లభించింది. అతను దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్‌పై విచారణ ముగిసే వరకు అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశించింది. బెయిల్‌పై విచారణను కోర్టు శనివారానికి వాయిదా వేసింది. ఇదిలావుంటే పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు తేజ్‌పాల్‌ గోవాకు రాగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో వచ్చిన ఆయన్ని గోవా విమానాశ్రయం చేరుకోగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి తరుణ్‌ను న్యాయస్థానానికి తీసుకెళ్లనున్నారు. పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యేందుకే తాను గోవా వచ్చినట్లు తరుణ్‌ తేజ్‌పాల్‌ అన్నారు. తేజ్‌పాల్‌కు వ్యతిరేకంగా పలువురు మహిళలు, పౌరులు విమానాశ్రయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. నల్లజెండాలతో నిరసన తెలిపారు. మరోవైపు తెహల్కా మాజీ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించిన బాధితురాలు, వేధింపుల కేసు విషయంలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపుల కేసుకు దూరంగా ఉండాలని, కేసులో జోక్యం వద్దని బాధితురాలు భారతీయ జనతా పార్టీతోపాటు పలు రాజకీయ పార్టీలను కోరారు. బాధితురాలు శుక్రవారం మాట్లాడుతూ.. తేజ్‌పాల్‌ లైంగిక వేధింపుల కేసు విషయంలో రాజకీయ పార్టీల జోక్యం కారణంగా కేసు హింసాత్మకంగా మారే అవకాశం ఉందని అన్నారు. తనపై తరుణ్‌ తేజ్‌పాల్‌ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించారు. . తనపై రాజకీయంగా కుట్ర పన్ని కేసులో ఇరికించారని ఇటీవల తరుణ్‌ తేజ్‌పాల్‌ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనేతలపై గతంలో ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం తనపై ఇలాంటి చర్యలకు పూనుకున్నట్లు తరుణ్‌ తేజ్‌పాల్‌ ఆరోపించారు. కాగా తరుణ్‌ తేజ్‌పాల్‌ చేసిన ఆరోపణలను గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ కొట్టిపారేశారు. తన ఆరోపణలను నిరూపించుకోవాలని తరుణ్‌ తేజ్‌పాల్‌కు ఆయన సవాల్‌ విసిరారు. తరుణ్‌ తేజ్‌పాల్‌పై లైంగిక ఆరోపణల కేసు వెలుగుచూసినప్పటి నుంచి తరుణ్‌ తేజ్‌పాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి నేతలు గోవా రాష్ట్రంలో నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. శుక్రవారం తనకు సమయం కావాలని తరుణ్‌ తేజ్‌పాల్‌ విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల్లోనే పోలీసులు అతనికి నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంటును జారీ చేశారు. కాగా నవంబర్‌ మొదటివారంలో గోవాలోని ఓ ¬టల్‌లోని లిఫ్టులో మహిళా జర్నలిస్టును తేజ్‌పాల్‌ లైంగికంగా వేధించారనే అభియోగంపై గోవా పోలీసులు నవంబర్‌ 22న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *