హైదరాబాద్: విద్యుత్ చార్టీల పెంపుదల సాకుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై చీటింగ్ కేసు పెట్టాలని సీసీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. విద్యుత్ చార్జీల పెంపుదల కోరుతూ డిస్కంలు విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు పంపించడంపై ఆయన మండిపడ్డారు. 2004లో ఛార్జీల పెంపుదలకు నిరసనగా జరిగిన ఉద్యమం ఆధారంగానే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ దొంగసాకులు చెప్పి మొసలి కన్నీరు కారుస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గ్యాస్, బొగ్గు ప్రైవేటు మాఫియా చేతిలోకి పంపించి చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ బిల్లును స్వాగతించిన నారాయణ పార్లమెంటులో ఆమోదించకపోతే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కొట్టుకుపోతుందన్నారు. కోస్తాంధ్రలో ఆందోళనలు వస్తాయని ముందునుంచి చెబుతున్నా పట్టించుకోలేదన్నారు. రాయలసీమతో ప్రత్యేక ప్యాకేజీతో పాటు నీటి వనరుల కేటాయింపులు స్పష్టంగా జరపాలని ఉమ్మడి రాజధాని ఉన్నంతకాలం ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.




