హైదరాబాద్: సొంత పార్టీ సభ్యులే అవిశ్వాసం పెట్టారంటే సమైక్యవాదం తీవ్రత ఎంత ఉందో అర్ధమవుతోందని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఏపీ ఎన్జీవో హోమ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీనామా చేయని ఎంపీలను సాంఘిక బహిష్కరణ చేయాల్సిఉంటుందన్నారు. రాజకీయ నేతలపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం నిన్నటి ఆందోళనల్లో తెలిసిందన్నారు. ఇంత జరిగినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, విభజన వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేకుండా పోతుందని, రాష్ట్రంలో 80 శాతం ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారని అశోక్ బాబు అన్నారు. శాసన సభకు బిల్లు వచ్చిన తర్వాత అన్ని పార్టీలు వ్యతిరేకించాలని ఆయన కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో తీర్మానానికి, అభిప్రాయ సేకరణకు పెద్దగా తేడా లేదని అశోక్ బాబు పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నంత కాలం తమ ఆందోళనలు జరుగగుతాయన్నారు. తెలంగాణ బిల్లును గెలిపించుకునేందుకు దిగ్విజయ్ ఇక్కడకు వస్తున్నారని తెలిసిందని, దిగ్విజయ్ రాక రాష్ట్రానికి అపశకునమని అశోక్ బాబు వ్యాఖ్యానించారు. దిగ్విజయ్ గో బ్యాక్ అంటూ ఈ నెల 12 నుంచి నిరసనలు చేపడతామన్నారు.




