హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు విషయంలో తెదేపా ఎమ్మెల్యేలు ఆత్మప్రబోధం మేరకు వ్యవహరించాలని జగన్ కోరడంపై తెదేపా నేతలు మండిపడ్డారు. 2009 నుంచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తెదేపా తీవ్రస్థాయిలో కృషి చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, దేవినేని ఉమామహేశ్వర్‌రావులు స్పష్టం చేశారు. జగన్ కుటుంబం కారణంగానే రాష్ట్రం విడిపోయే పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. గతంలో కూడా జగన్, విజయమ్మ సమన్యాయం కోసం దీక్షలు చేశారే తప్ప సమైక్యం కోసం కాదని గుర్తు చేశారు. పరకాల ఉప ఎన్నికలు, ఇడుపుల పాయ తీర్మానాల ద్వారా వైకాపా తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పారని పేర్కొన్నారు. జగన్ సమైక్య వాదం ముసుగులో ఉన్న వేర్పాటువాదని వారు మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని తెదేపా నేతలు స్పష్టం చేశారు.




