నందాగామ రూరల్, కృష్ణా: నందిగామ శివారు అనాసాగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు ప్రవర్తనను నిరసిస్తూ విద్యార్థులు శుక్రవారం తరగతులు బహిష్కరించారు. ఉపాధ్యాయుడు బాలికల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ పాఠశాల గేటును తెరవనీయకుండా అడ్డుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకోవడంతో ఉపాధ్యాయులకు, విద్యార్థులతల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడిపై వారు దాడి చేయగా ఆయన ప్రధానోపాధ్యాయుని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ నాగేశ్వర రావు, ఎస్సై రామకృష్ణ పాఠశాలను సందర్శించి విద్యార్థులను శాంతింపజేశారు. ఉపాధ్యాయుడి ప్రవర్తనపై అధికారులు విచారిస్తున్నారు.




