హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో భేటీ అయ్యారు. శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసిన రాష్ట్రపతిని కలిసిన సీఎం రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు గంటపాటు వీరిద్దరి మధ్య చర్చలు కొనసాగాయి. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే కొత్త సమస్యలను రాష్ట్రపతికి ఈ సందర్భంగా వివరించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్య, నిరుద్యోగ సమస్య, సరిహద్దులకు సంబంధించి భద్రాచలం, ఇతర ప్రాంతాలు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు సంబంధించి కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ముసాయిదా బిల్లులో పూర్తిస్థాయి వివరాలు లేవన్న విషయం కూడా సీఎం రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. విభజనపై సీమాంధ్ర ప్రజాప్రతినిధుల నుంచి వ్యక్తమవుతోన్న వ్యతిరేకత గురించి కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది.




