న్యూఢిల్లీ :సార్వత్రిక ఎన్నికల సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ రెండో వారం నుంచి మే మొదటి వారం వరకూ ఐదు దశల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు కసరత్తు చేస్తోంది.వచ్చే నెలాఖరులో గానీ, మార్చి మొదటి వారంలో గానీ కేంద్ర ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకూ ఎన్నికలు జరుగుతాయి. 294 మంది శాసనసభ్యులు గల ఆధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రం రాష్ట్ర విభజనకు చేపట్టిన ప్రక్రియ వల్ల ఎన్నికల నిర్వహణకు ఎటువంటి
ఇబ్బందీ లేదని ఇరు వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు వీలుగా కేంద్ర పారా మిలిటరీ బలగాల నియామకంపై కేంద్ర ¬ం శాఖ కార్యదర్శితో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, పోలీస్ సిబ్బంది నియామకంపై ఆయా రాష్ట్రాల డీజీపీలు, రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులతోనూ కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమవుతుంది. తర్వాత మరోసారి కేంద్ర ¬ంశాఖ కార్యదర్శితో ఎన్నికల సంఘం చివరి సారి సమావేశమైన తర్వాత షెడ్యూల్ ఖరారు చేస్తోంది.
ప్రస్తుత లోక్సభ గడువు జూన్ ఒకటో తేదీతో ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో మే 31వ తేదీ నాటికి కొత్త లోక్సభ ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. 5 దశల్లోనే ఎన్నికలు నిర్వహిస్తారా? మరో ఒకటి, రెండు దశలు పెంచుతారా? అన్నది తేలాల్సి ఉంది. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది తమ ఓటు హక్కును సద్వినియోగించుకోనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ముందు లోక్సభ చివరిసారిగా సమావేశమై వచ్చే ఆర్థిక సంవత్సర ప్రథమార్థ భాగానికి ప్రభుత్వం వ్యయం కోసం ఓటాస్ అక్కౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఇదిలా ఉంటే ఇటీవలి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ సాధించిన విజయం నేపథ్యంలో కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, అవినీతిని నిరోధించేందుకు చర్యలు చేపడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికల నిర్వహణకు 1.1 కోట్ల మంది సిబ్బంది అవసరమన్న కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు అందులో సగం భద్రతా సిబ్బందేనని తెలిపాయి. 55 లక్షల మంది పౌర అధికారులు ఎన్నికల విధులు నిర్వర్తించనుండగా, కేంద్ర ప్రభుత్వ శాఖల ఉద్యోగులను ఎన్నికల పరిశీలకులుగా ప్రకటించే అవకాశం ఉంది. 8 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే చివరి క్షణంలో పోలింగ్ సిబ్బంది, ఓటర్లకు వెసులుబాటు కల్పిస్తూ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఈసీ వర్గాలు తెలుపుతున్నాయి. 12లక్షల ఈవీఎంలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. అందులో భాగంగా 2.5లక్షల ఈవీఎం తయారీకి కేంద్ర ఎన్నికల సంఘం వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు ఆర్డర్లు ఇచ్చింది కూడా 2009 ఎన్నికల షెడ్యూల్ మార్చి రెండో తేదీన ప్రకటించారు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి మే 13వరకు ఐదు దశల్లో పోలింగ్ పూర్తి చేశారు. మే 16వ తేదీన కౌంటింగ్ నిర్వహించారు. 1971 తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఏనాడూ లోక్సభ ఎన్నికలు ఒకే దశలో నిర్వహించలేదు. బహుళ దశ ఎన్నికల ప్రక్రియ నిర్వహణ ద్వారా ఓటర్లలో పూర్తి స్థాయి సంతృప్తి కలిగించాలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం ముందుకెళ్తున్నది. ఉగ్రవాదుల ముప్పు ఉన్న జమ్ముకాశ్మీర్, నక్సలైట్ల బెడద గల చత్తీస్ఘడ్ రాష్ట్రాల పరిధిలో లోక్సభ ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు మూడు నెలల సమయం పడుతుందన్నారు. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి పోలింగ్ తేదీకి మధ్య ఆరు వారాల గడువు ఉండాలన్న సుప్రీం కోర్టు మార్గదర్శకాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంటున్నది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ప్రవర్తనా అమల్లోకి వస్తుంది. లోక్సభ, శాసనసభల గడువు ముగియడానికి రెండు వారాల ముందు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కింలతో పాటు ముందస్తు శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం తమకు విజ్ఞప్తి చేయలేదని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. హర్యానా శాసనసభకు ముందస్తుగానే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని పుకార్లు షికారు చేశాయి. ఒడిశా రాష్ట్ర శాసనసభకు 147మంది సభ్యులు, సిక్కిం శాసనసభకు 32మంది శాసనసభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ గడువు 2014జూన్ రెండో తేదీ వరకూ, ఒడిషా శాసనసభ గడువు జూన్ ఏడో తేదీ వరకూ, సిక్కిం అసెంబ్లీ గడువు మే 21వ తేదీతో ముగుస్తుంది.




