Wednesday, 4 November 2026

నటసామ్రాట్‌ అక్కినేని ఇకలేరు పెద్ద దిక్కును కోల్పోయిన తెలుగు సినీ పరిశ్రమ


హైదరాబాద్‌ : ఓ మహా దిగ్గజం నేలరాలింది. తెలుగు కళామతల్లి చిన్న బోయింది. తెలుగువారి ఆరాధ్య నటుడు తెలుగు వెండితెర మూలస్తంభం అక్కినేని నాగేశ్వరరావు (91) కన్నుమూశారు. తెలుగు వెండితెరపై తన నట వైదుష్యంతో దశాబ్దాలపాటు తెలుగువారిని అలరించిన , తన నటనతో మెప్పించిన నట సామ్రాట్‌ ‘దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు బుధవారం తెల్లవారు జామున 2 గంటలకు పరమపదించినారు. ‘బుద్దిమంతుడిగా మురిపించినా, దేవదాసుగా అలరించినా, దసరా బుల్లోడుగా చిందులేసినా ఆయన నటనా అసామాన్యం. ఇటీవలే తన ఒంట్లో కొంతనలతగా ఉందని ,వైద్యులు పరీక్షించి క్యాన్సర్‌ అని తేల్చారని, ప్రేక్షకులు దీవిస్తే నిండు నూరేళ్లు జీవించగలనని ఆత్మవిశ్వాసంతో చెప్పిన ధీరోదాత్తుడు అంతలోనే తన జీవన ప్రస్థానాన్ని ముగించారు. అక్కినేని భౌతిక కాయాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ప్రేక్షకులు ,అభిమానుల సందర్శనార్ధం ఉంచారు.
అక్కినేనికి పలువురు సీని,రాజకీయ ప్రముఖుల నివాళి :
అక్కినేని భౌతిక కాయాన్ని సీని, రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. శాసనసభ స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ ,తెదేపా ఆధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు కాసు కౄష్ణారెడ్డి, దానం నాగేందర్‌, ఎమ్మెల్యే జయసుధ దంపతులు, దాసరి నారాయణరావు, రామానాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ, ఎమ్మెల్యే జయప్రకాశ్‌ నారాయణ, మంత్రి డి.కె అరుణ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, దర్శకుడు రాఘువేంద్రరావు, మోహన్‌బాబు దంపతులు ,రచయిత సినారె ,నటులు శ్రీకాంత్‌, జగపతిబాబు, సురేశ్‌బాబు, పరుచూరి బ్రదర్స్‌, దర్శకులు రాజమౌళి, శ్రీనువైట్ల ,వి.వి.వినాయక్‌ తదితరులు అక్కినేనికి సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.
అక్కినేని జీవిత విశేషాలు :
– అక్కినేని కృష్ణా జిల్లా వెంకటరాఘవాపురంలో 1924 సంవత్సరం సెప్టెంబర్‌ 20న వెంకటరత్నం- పున్నమ్మ దంపతులకు జన్మించారు.
– నాలుగో తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి నాటకాలపై మక్కువ పెంచుకున్నారు.
– రాఘవాపురం పాఠశాల వార్షికోత్సవంలో మొదటిసారిగా చంద్రమతిగా ఆడవేశం వేశారు.
– కేరీర్‌ తొలి నాళ్లలో ఎక్సెల్షియర్‌ నాటక సంస్థలో పనిచేశారు.
– ఘంటసాల బలరామయ్య ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమయ్యారు.
– 1944 మే 8న సీనినటుడిగా మద్రాసులో అక్కినేని ప్రస్థానం ప్రారంభమైంది.
– అక్కినేని మొట్టమొదటి చిత్రం తల్లిప్రేమలో తొలివేషం.
– ధర్మపత్ని చిత్రంతో 17 ఏళ్ల వయసులో తెరంగేట్రం.
– అక్కినేని సీని జీవితాన్ని మార్చిన చిత్రం దేవదాసు
– సుడిగుండాలు సినిమాకు మొట్టమొదటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్న అక్కినేని.
– అక్కినేని అందుకున్న శిఖరాలు
– 1957-నటసామ్రాట్‌
– 1968-పద్మశ్రీ
– 1977-కళా ప్రపూర్ణ
– 1989 -రఘుపతి వెంకయ్య అవార్డు
– 1991-దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు
– 1993 -గౌరవ డాక్టరేట్‌
– 1995-అన్నా అవార్డు(తమిళనాడు ప్రభుత్వం)
– 1996-ఎన్టీఆర్‌ జాతీయ ఫిలిం అవార్డు
– 1998-పద్మభూషణ్‌
– 2011-పద్మవిభూషణ్‌
– 2012లో తానా జీవిత సాఫల్య పురస్కారం
– అక్కినేని మొత్తం నాలుగు ఫిలిఫేర్‌ అవార్డులు అందుకున్నారు.
– మేఘసందేశం, బంగారు కుటుంబం చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు.
అక్కినేని కుటుంబం :
భార్య : స్వర్గీయ అన్నపూర్ణ
సంతానం : సత్యవతి, నాగసుశీల, సరోజ, వెంకట్‌, నాగార్జున(అమల-కోడలు)
మనవళ్లు : సుమంత్‌, సుశాంత్‌, నాగచైతన్య,అఖిల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *