50 శాతం మహిళలే ముఖ్యమంత్రులు
కాంగ్రెస్ ప్రచార సారథి రాహుల్‌గాంధీ
భోపాల్, జనవరి 21 (జనంసాక్షి) :
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 50 శాతం మహిళలనే ముఖ్యమంత్రులగా నియమిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సారథి, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. మంగళవారం భోపాల్‌లో నిర్వహించిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజల కష్టాలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తర్వాత నిర్వహించిన సమావేశానికి హాజరైన రాహుల్ పార్టీ శ్రేణులు సానుకూల దృక్పథంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యూపీఏ ప్రభుత్వం ప్రజల కోసమే తీసుకువచ్చిన వివిధ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తే సార్వత్రిక ఎన్నికల్లో విజయం తథ్యమని ఉద్భోదించారు. పార్టీకి పరాజయాలు కొత్తేమీ కాదని, పరాజయాలకు కుంగిపోతే మొదటికే మోసం వస్తుందన్నారు. ఓటమిని సవాలుగా తీసుకొని ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నించాలన్నారు. మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, దేశ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పాలన సాగిస్తోందని చెప్పారు. ఆహార భద్రతా చట్టం, విద్యాహక్కు చట్టం, లోక్‌పాల్ తదితర చట్టాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే ప్రజలకు రక్షణతో పాటు అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు మతతత్వ శక్తులు పన్నుతున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తమ ఓటు ద్వారా భారత లౌకికవాదాన్ని పరిరక్షించాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికే గుర్తింపు లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి కేంద్రంలో మూడో సారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టేందుకు కృషి చేయాలన్నారు. మహిళాభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, యాభై శాతం పదవులు వారికే కట్టబెడతామని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో




