Monday, 2 November 2026

శాసనసభ ప్రాంగణంలో భారీ భద్రతా ఏర్పాట్లు

భారీఎత్తున మార్షల్స్‌
బయట పోలీసు బలగాలు
మీడియాపై ఆంక్షలు
గ్యాలరీలోకి అనుమతి నిరాకరణ
హైదరాబాద్‌, జనవరి 30(జనంసాక్షి): రాష్ట్ర శాసనసభ ఆవరణలో గురువారం యుద్ధవాతావరణం నెలకొంది. రాష్ట్రపతి నుంచి శాసనసభకు వచ్చిన విభజన ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు గురువారంతో గడువు ముగియనుంది. సభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇచ్చిన నోటీసుపై చర్చ జరగాలని, ఓటింగ్‌ పెట్టాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేస్తుండగా.. సభలో విభజన బిల్లుపై చర్చ ముగించి యథాతథంగా బిల్లును వెనక్కి పంపాలని తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. గురువారం  ముఖ్యమంత్రి ఇచ్చి నోటీసుపై ఓటింగ్‌ పెడుతామంటూ స్పీకర్‌ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. దీంతో తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్‌ నిర్వహించేందుకే స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియడంతో తెలంగాణవాదులు సభను నిర్వహించకుండా అడ్డుపడాలని నిర్ణయించారు. సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు శాసనసభలో తమపై భౌతికదాడులు జరగవచ్చని, తమకు భద్రత కల్పించాలని స్పీకర్‌ను కోరారు. దీంతో స్పీకర్‌ భద్రత పెంచాలని చీఫ్‌ మార్షల్స్‌ను ఆదేశించారు. కేవలం స్పీకర్‌ ముందే 35మంది మార్షల్స్‌ రక్షణగా నిలబడ్డారు. స్పీకర్‌పై ఏ కాగితాలు విసరకుండా, చొచ్చుకురాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. శాసనసభ లాబీల్లో కూడా తెల్లని దుస్తులు ధరించిన మార్షల్స్‌ అడుగడుగునా మోహరించారు. సభా కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు ఏర్పాటు చేసిన మీడియా గ్యాలరీలోకి అనుమతించలేదు. దీంతో మీడియా సిబ్బంది పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి సీఎం నోటీసు తిరస్కరించాలని పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఐదు నిమిషాల్లోపే సభను గంటసేపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశం మందిరంలో భేటీ అయ్యారు. సభలో స్పీకర్‌ ఓటింగ్‌ పెడితే ఎలా అడ్డుకోవాలి అన్న అంశంపై వారు కసరత్తు చేశారు. ఒకవేళ అనుమతిస్తే అడ్డుకోవడమే కాకుండా ముఖ్యమంత్రి ఎత్తులను తిప్పికొట్టాలని నిర్ణయించారు. ఎన్నడూ లేని విధంగా శాసనసభ లోపల, బయట ఉద్రిక్తత నెలకొంది. చివరకు మీడియా సిబ్బంది మధ్య కూడా విభజన స్పష్టంగా కనిపించింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారా అనే పరిస్థితి నెలకొనడం దారుణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *