Tuesday, 3 November 2026

ఇరు ప్రాంత నేతలు ఢిల్లీలో హడావుడి..

మారని సీఎం వైఖరివార్‌ రూమ్‌లో అదే వాదన..నేడు శక్తిస్థల్‌ వద్ద ఒక రోజు దీక్ష

పోటీగా టి. నేతల నిరసన

బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు

బీజేపీపై ఒత్తిడి.. పునరాలోచనలో నాయకత్వం

బిల్లు ఆమోదంపై మంత్రి మండలి ముమ్మర కసరత్తు

సవరణలపై జీవోం దృష్టి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి తీరుతామని యూపీఏ ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ పట్ట్టుదలతో పావులు కదుపుతుండగా సీమాంధ్ర నేతల ఒత్తిడికి తలొగ్గిన భారతీయ జనతాపార్టీ ఇచ్చిన హామీని మరిచి రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్‌ ముందుకు రాకుండా చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో ప్రక్రియ పూర్తై ఢిల్లీకి చేరిన నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ నాయకులంతా ఢిల్లీకే మకాం మార్చారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇరు ప్రాంతాల నేతలను కలుసుకుని ఇప్పటికే ఢిల్లీకి చేరి రాష్ట్రపతితోపాటు జాతీయ నేతలను కలుసుకున్నారు. విభజన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా లేదని దాన్ని పునర్‌పరిశీలించాలని సమ న్యాయం అంటూ పాత పల్లవిని అందుకున్నారు. ఆయన ద్వంద్వ ప్రమాణాలను, రెండు కళ్ల సిద్ధాంతాన్ని, కొబ్బరి చిప్పల వ్యవహారంలా కొనసాగిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కె. చంద్రశేఖరరావు పార్టీ నాయకులు అందరినీ తీసుకుని నాలుగు రోజుల కిందే ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటికే ఆయన పలువురు జాతీయ నేతలను కలిసి తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నేతలు ఢిల్లీకి చేరి ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం విభజన ప్రక్రియను నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల కమిటీ సమావేశమైంది. బిల్లులో పలు సవరణలపై మంత్రులు కమిటీ దృష్టి సారించింది. ఆ వెంటనే కేంద్ర మంత్రి వర్గం సమావేశమైంది. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ఆమోదింప చేసేందుకు మంత్రి మండలిలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రాత్రి కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో కీలక సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ సీమాంధ్ర ఎంపీలతోపాటు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితరులతో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌లో పార్టీ విధానాన్ని ఒక్కటిగానే వినిపించాలని సీమాంధ్ర ప్రాంతానికి కావాల్సిన ప్రయోజనాలను కాపాడుతామని తెలంగాణ బిల్లును అడ్డుకోవదంటూ కాంగ్రెస్‌ పెద్దలు సీమాంధ్ర ఎంపీలకు సూచించారు. అయితే ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర ఎంపీలు బిల్లుకు సహకరించేందుకు ససేమిరా అన్నారు. ముఖ్యమంత్రి గతంలో నిర్ణయించిన మాదిరిగానే శక్తిస్థల్‌ వద్ద దీక్షకు కూర్చోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు పోటీగా తెలంగాణ నేతలు, ఇందిరాగాంధీ సమాధి వద్ద దీక్ష చేయనున్నారు. ఇలా ఎవరికి వారు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం బీజేపీ పాత్ర కీలకంగా మారింది. బిల్లు ప్రవేశపెడితే సభను సాఫిగా నడిపించేందుకు ప్రయత్నించాలని సభలో ఆందోళన చేసే సభ్యులపై చర్యలు తీసుకోవద్దని అప్పుడే తాము బిల్లుకు మద్దతు ఇస్తామంటూ మెలిక పెడుతోంది. కాంగ్రెస్‌ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం బీజేపీ వైఖరిని ఎండగడుతోంది. సభలో ఆందోళన చేసేవారిని సస్పెండ్‌ చేసైనా తెలంగాణ బిల్లుతోపాటు ఆరు అవినీతి వ్యతిరేక బిల్లులను ఆమోదింపజేేసుకుంటామని స్పష్టం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలని బీజేపీ భావిస్తుండడం, కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవకాశం ఇస్తే తమకు వచ్చే ప్రయోజనం ఏమిటన్న ఉద్దేశంతోనే బీజేపీ వెనక్కు తగ్గిందనే వాదనలు వినవవస్తున్నాయి. పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *