హైదరాబాద్, ఫిబ్రవరి 15 : కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనపై ఏకపక్షంగా వ్యవహరిస్తోందని హార్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. మోడీ దేశ ప్రధాని అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు రాష్ట్రంలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్లో శనివారం మీడియాతో మాట్లాడుతూ, ఇరు ప్రాంత ప్రజల మనోభావాలు గౌరవించకుండా కేంద్రం అహంకారపూరితంగా విభజనకు అఘమేఘాలపై నిర్వహిస్తోందని మండిపడ్డారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం సరికాదని ఆయన హితవు పలికారు. విభజనను వ్యతిరేకిస్తూ శాసనసభ తీర్మానం చేసినప్పటికీ కేంద్రం మొండిగా ఎందుకు ముందుకు పోతోందని ప్రశ్నించారు. కేంద్రంలోని పాలకులు రాష్ట్ర ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టారని, కొద్దిమంది నేతలు తమ స్వార్థంకోసం విభజనకు పూనుకోవడం విచారకరమని అన్నారు. అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలని అన్నారు. హడావుడిగా, గందరగోళాల మధ్య తీసుకునే ఏ నిర్ణయమైనా వృధా అవుతాయని ఆయన హెచ్చరించారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరివల్ల అభివృద్ధి పూర్తిగా కుంటు పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం వైఖరివల్లే పార్లమెంట్లో సభ్యులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారని అన్నారు. మంత్రుల మాటలకు విలువ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ పాలక, ఆర్థిక వ్యవస్థ వెంటిలెటర్లపై ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో సుస్థిర ప్రభుత్వం అవసరమని అన్నారు. ప్రభుత్వ తప్పిదంవల్లే పేద ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. మోడీ వంటి సమర్థవంతమైన వ్యక్తిని ఎన్నుకుంటేనే దేశంలో సుస్థిర పాలన ఏర్పడుతుందని, అభివృద్ధిపథంలో పయనిస్తుందని అన్నారు.




