హైదరాబాద్, ఫిబ్రవరి 15 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటే జరిగేది యుద్ధమేనని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన సిఎల్‌పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి అభినవ ఒసామా బిన్‌లాడెన్, ఎంపి లగడపాటి రాజగోపాల్ అభినవ అఫ్జల్‌గురు అని వర్ణించారు. సీమాంధ్ర నేతలు మానవత్వం లేకుండా రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలు వారికి ఎందుకు కనపడడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరించిన లగడపాటితో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రపతి తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెడితే తన పదవికి రాజీనామా చేస్తానన్న ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. కిరణ్ కుమార్‌రెడ్డి నాలుక తాటిమట్ట అని ప్రశ్నించారు. మనిషివైతే చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి పదవికి రాజీనామా చేయాలని ముఖ్యమంత్రిని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణను అడ్డుకుంటే జరిగే యుద్ధం ఏ రూపంలో ఉంటుందో చెప్పలేమన్నారు. నోటి ముందున్న ముద్దను లాక్కుంటే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ కోసం ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. తెలంగాణాను అడ్డుకుంటే జరిగే యుద్దానికి చంద్రబాబు, జగన్, కిరణ్ బాబులే బాధ్యత వహించాలని అన్నారు. జీవో 15ను విడుదల చేసి రూ.4వేలకోట్లను దండుకోవాలని ముఖ్యమంత్రి యత్నించారని ఆరోపించారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించే ధర్నాలో రౌడీలను సీమాంధ్ర నేతలు ప్రత్యేక రైళ్ళల్లో తరలిస్తున్నారని చెప్పారు. సీమాంధ్రకు ఏమి కావాలో కోరుకుంటే మంచిదని, తెలంగాణాను అడ్డుకుంటే అంతుచూస్తామని హెచ్చరించారు.




